Telangana news : యూరియా సరఫరా తగినంతగా ఉందని రాష్ట్ర అధికారులు పదేపదే ప్రకటనలు చేస్తున్నప్పటికీ వరంగల్ (Warangal), కరీంనగర్ (Karimnagar) జిల్లాల్లోని యూరియా కొరత (Urea Shortage)తో రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. పొరుగు జిల్లాల నుంచి అదనపు ఎరువుల నిల్వలను తీసుకుంటున్నట్లు అధికారులు ఒకవైపు చెబుతున్నప్పటికీ, రైతులు మండుతున్న ఎండల్లో గంటలపాటు వేచిచూడాల్సి దుస్థితి ఎదురవుతోంది. క్యూలైన్లలో నిలుచున్నా కూడా చాలా మందికి యూరియా అందలేదని పలువురు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరీంనగర్ జిల్లాలోని చాలా గ్రామాల్లో ఇలాంటి పరిస్థితుల స్పష్టంగా కనిపిస్తోంది. స్థానికులు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (PACS) వెలుపల క్యూలో నిలబడుతున్నారు. కొందరు ఎండలను తాళలేక తమ చెప్పులు, సంచులను లైన్‌లో ఉంచి, తమకు కేటాయించిన యూరియా కోసం ఎదురు చూస్తున్నారు. కొందరు రైతులకు తమ వాటా లభించినప్పటికీ, చాలా మంది రైతులు ఉత్త చేతులతో వెనుదిరిగిపోతున్నారు.
ఇదిలా ఉండగా రైతులు అవసరానికి మించి కొనుగోలు చేస్తున్నారని, ఎక్కువగా నిల్వలు చేయడం వల్లే కొరత ఏర్పడిందని రాష్ట్ర అధికారులు సెలవిస్తున్నారు. అయితే, ముఖ్యంగా వరి, మొక్కజొన్న సాగు సర్వేల ఆధారంగా కేటాయింపులను చేయడం ద్వారా, ఖచ్చితమైన అంచనాలు వేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందని రైతు సంఘాలు నేతలు స్పష్టం చేస్తున్నారు.ఎరువుల పంపిణీలో జాప్యం రైతుల కష్టాలను మరింత పెంచింది. కొందరు తమ ఆధార్ వివరాలను దుర్వినియోగం చేసి యూరియాను అక్రమ బ్లాక్ మార్కెట్‌లోకి తరలిస్తున్నారని ఆరోపించారు.
Urea Shortage : అతిగా వినియోగిస్తే అనర్థాలే..
కరీంనగర్‌లో 42,416 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం కాగా, 38,255 మెట్రిక్ టన్నులు ఇప్పటికే స్థానిక రైతులకు పంపిణీ చేసినట్లు అధికారులు గుర్తించారు. స్థానిక డీలర్లు 1,534 మెట్రిక్ టన్నులు స్టాక్‌లో ఉంచారు. పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడానికి కలెక్టర్ పమేలా సత్పతి ఇటీవల పొరుగు జిల్లాల నుంచి అదనంగా 1,500 మెట్రిక్ టన్నులను సేకరించారు. కరీంనగర్ జిల్లా వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మి స్పందిస్తూ రైతులకు నిరంతరం ఎరువులను సరఫరా చేస్తున్నామని, రైతులు భయపడవద్దని, అధిక వినియోగం వల్ల కలిగే ప్రమాదాల గురించి జాగ్రత్తగా ఉండాలని కోరారు. “యూరియాను అధికంగా వాడటం వల్ల తెగుళ్లు, వ్యాధులు వ్యాపిస్తాయని ఆమె హెచ్చరించారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..








