Telangana | దేశంలో ఏ రాష్ట్రంలో పండని విధంగా ఈ వానాకాలంలో తెలంగాణలో 66.7లక్షల ఎకరాల్లో రికార్డు స్థాయిలో 153 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం పండింది. ఇది వ్యవసాయానికి సంబంధించి అతిపెద్ద రికార్డు అని రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) తెలిపారు. ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా ప్రజా పాలన విజయోత్సవాల్లో భాగంగా మహబూబ్ నగర్ జిల్లాలో ఏర్పాటు చేసిన రెండు రోజుల రైతు పండగలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. రైతు పండుగ వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. అనంతరం అవగాహన సదస్సులో మంత్రి ఉత్తమ్ కుమార్ మాట్లాడారు. దేశంలోనే అత్యధికంగా వరి సాగు చేసి దేశంలో మొదటి స్థానం సాధించిందన్నారు. అందుకే రైతులు పండగ చేసుకుంటున్నారని తెలిపారు.
రైతులకు మంచి పంటలు పండాయని ప్రభుత్వం సైతం దొడ్డు రకానికి మద్దతు ధరకు కొనుగోలు చేసి, సన్న రకం వరికి మద్దతు ధరతో పాటు అదనంగా క్వింటాలుకు రూ.500 బోనస్ ఇస్తున్నామన్నారు. రైతులు పండించిన చివరి గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని భరోసా ఇచ్చారు. రైతు పండగ ఏర్పాట్లు, స్టాళ్లు చాలా అద్భుతంగా ఉన్నాయని.. ఇందుకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల అనుభవం, ఆయన దక్షత కారణమని కొనియాడారు.
రాష్ట్ర పరిస్థితులు ఎలా ఉన్నా ప్రభుత్వం పూర్తిగా రైతు పక్షపాతి అని అన్నారు. గత పాలకులు రుణమాఫీ చేస్తామని చెప్పి మొదటి ఐదేళ్లలో కేవలం వడ్డీ మాత్రమే మాఫీ చేసిందని, తర్వాత అరకొర రుణమాఫీ చేసి చేతులెత్తేసిందని అన్నారు. ప్రస్తుత ప్రభుత్వం 18 వేల కోట్లతో 21 లక్షల మంది రైతుల రుణమాఫీ చేశామని చెప్పారు. మిగిలిన కొంత మంది రైతుల రుణమాఫీపై ముఖ్యమంత్రి ఒక ప్రకటన చేస్తారని తెలిపారు.