Uttarkashi Floods | ఉత్తరాఖండ్ (Uttarakhand)లోని ఉత్తరకాశీలో వరదలు బీభత్సం సృష్టించాయి. ధరాలీ గ్రామంపై ఒక్కసారిగా వరద నీరు పోటెత్తడంతో ఐదుగురు మృతి చెందినట్లు సమాచారం. 10 మంది జవాన్లు వరదల్లో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. దాదాపు 50 మందికి పైగా శిథిలాల కింద చిక్కుకుని ఉంటారని, 20-25 హోటళ్లు, నివాసాలు వరద ప్రవాహంలో కొట్టుకుపోయాయని స్థానికులు తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఎస్‌డీఆర్ఎఫ్ రెస్క్యూ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుంది. సహాయక చర్యల కోసం ఉత్తరాఖండ్ ప్రభుత్వం భారత సైన్యాన్ని అప్రమత్తం చేసింది. ఎన్డీఆర్ఎఫ్, ఐటీబీపీ బృందాలు ఘటనా స్థలానికి బయల్దేరి రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. కాగా ఈ ఘటన (Uttarkashi Tragedy)పై ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్‌సింగ్ ధా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయక చర్యల విషయంలో సీనియర్ అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు వెల్లడించారు. ఉత్తరకాశీ ప్రాంతంలోని ధరాలీలో కుండపోత వర్షాల వల్ల భారీ నష్టం జరిగిందనే వార్త చాలా బాధాకరమన్నారు. ఎస్‌డీఆర్ఎఫ్, ఎన్‌డీఆర్ఎఫ్, జిల్లా యంత్రాంగం, సంబంధిత అధికార బృందాలు యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యల్లో నిమగ్నమై పనిచేస్తున్నాయని తెలిపారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలను తరలిస్తున్నట్లు ఆయన తెలిపారు. బాధిత ప్రజలకు సాధ్యమైనంతగా అన్ని విధాలా సహాయం అందిస్తామని భరోసా ఇచ్చారు.
ఇదిలా ఉండగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా (Amit Shah) సీఎం పుష్కర్ సింగ్ ధామీకి ఫోన్ చేసి స్థానిక పరిస్థితులపై వివరాలు తెలుసుకున్నారు. కేంద్రం తరఫున అన్ని సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. ధరాలీ ఘటనలో బాధిత కుటుంబాలకు ప్రధాని మోదీ (PM Modi) సంఘీభావం ప్రకటించారు. ముఖ్యమంత్రి ధామీతో మాట్లాడి వివరాలు ఆరా తీసినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణలో సహాయ బృందాలు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.