VCIWU | తెలంగాణలో ఉన్నత ప్రమాణాలతో విద్యావకాశాలను మెరుగుపర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ( Telangana government( మరో అడుగు ముందుకేసింది. ఇందులో భాగంగా హైదరాబాద్‌లోని కోఠి (Koti)లో ఉన్న వీరనారి చాకలి ఐల్లమ్మ మహిళా విశ్వవిద్యాలయానికి (VCIWU) భారీగా నిధులను కేటాయించింది. వీటితో కొత్త భవనాలను నిర్మించడంతోపాటు ప్రాచీన భవనాలను పునరుద్ధరించనున్నారు. తద్వారా ఉత్తమ వసతులతో విద్యా ప్రమాణాలను మెరుగుపర్చనున్నారు.
VCIWU : అభివృద్ధి ప్రణాళిక
వీరనారి చాకలి ఐల్లమ్మ మహిళా విశ్వవిద్యాలయానికి ( Veeranari Chakali Ilamma Women’s University (VCIWU) కొత్త భవనాల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.540 కోట్లు కేటాయించింది. రూ.15.5 కోట్లతో ప్రాచీన నిర్మాణాలను పునరుద్ధరించనుంది. ఇందులో భాగంగా రూ. 100 కోట్లను తక్షణమే విడుదల చేసింది. ఈ విశ్వవిద్యాలయానికి తగినంత సౌకర్యాలు అందించేందుకు కొత్త తరగతి గదులు, ప్రయోగశాలలు, గ్రంథాలయం, హాస్టల్, స్పోర్ట్స్ కాంప్లెక్స్ తదితర నిర్మాణాలను చేపట్టనుంది. విద్యార్థినులకు ప్రత్యేక వసతుల కల్పన, భద్రత కోసం అధునాతన సీసీటీవీ కెమెరాలు, సెక్యూరిటీ సేవలు ఏర్పాటు చేయనుంది.
జాతీయ స్థాయిలో ఉన్న విద్యా ప్రమాణాలు
ఈ విశ్వవిద్యాలయాన్ని ప్రీమియర్ విద్యాసంస్థగా మార్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులేస్తోంది.
యూనివర్సిటీని జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మకంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని చెబుతోంది. మహిళా విద్యను ప్రోత్సహిస్తూ ఆధునిక హంగులతో విశ్వవిద్యాలయాన్ని తీర్చిదిద్దాలన్నదే తమ ధ్యేయమని అంటోంది. కొత్త భవనాలను నిర్మించడంతోపాటు చారిత్రక ప్రాముఖ్యత ఉన్న భవనాలను రక్షించడమే కర్తవ్యంగా భారీగా నిధులు కేటాయించినట్టు పేర్కొంది. విశ్వవిద్యాలయ ప్రాంగణానికి మూసీ సమీపంగా ఉండటం వల్ల నదీ పునరుజ్జీవన ప్రాజెక్టు పూర్తయిన తర్వాత ప్రధాన ద్వారం తిరిగి తెరవనున్నట్టు తెలిపింది. ఇది రాకపోకలకు సౌలభ్యాన్ని మాత్రమే కాకుండా క్యాంపస్ అందాన్ని కూడా పెంచుతుందని అభిప్రాయ పడుతోంది.
సమీక్షించిన డిప్యూటీ సీఎం
ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క (Deputy Chief Minister Mallu Bhatti Vikramarka), ఉన్నతాధికారులు విశ్వవిద్యాలయాన్ని మార్చి 11న సందర్శించి ప్రస్తుత పరిస్థితులను సమీక్షించారు. ఈ పథకం అమలైన తర్వాత విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణాన్ని అందించగలమనే ఆశాభావం వ్యక్తమైంది. విద్యార్థులు, అధ్యాపకులు, పరిశోధకులకు ఉత్తమ వసతులు కల్పించేందుకు కృషి చేస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..








