- కోట్లు విలువ చేసే ధాన్యం మాయం చేసిన మిల్లు యాజమాన్యం?
- రబీ సీజన్లో ప్రభుత్వం కేటాయించిన ధాన్యం మాయం పై అనేక ఆరోపణలు
- పౌరసరఫరాల శాఖ అధికారులకు తెలుసా? తెలియదా ?
Hanamkonda | ఆ మిల్లు యాజమాన్యం కోట్లు విలువ చేసే ధాన్యం మాయం చేసిందా?ప్రభుత్వం సదరు మిల్లుకు పంపిన ధాన్యం ఆ మిల్లులో ఎందుకు లేనట్లు?కేటాయించిన ధాన్యాన్ని మిల్లు యాజమాన్యం బహిరంగ మార్కెట్ కు తరలించిందా?లేక అసలు ఆ మిల్లుకు పూర్తిస్థాయిలో ధాన్యమే రాలేదా?అనే ప్రశ్నలు ఇప్పుడు పౌరసరఫరాల శాఖలో చక్కర్లు కొడుతున్నాయి.హన్మకొండ జిల్లా (Hanamkonda District) గట్లకానిపర్తిలో ఉన్న వినాయక మిల్లుకు ప్రభుత్వం 2024-25 రబీ సీజన్ లో 3225.080 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మరాడించేందుకు పంపించింది. సదరు మిల్లు యాజమాన్యం ఆ ధాన్యాన్ని మరాడించి 2160 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సీఎంఆర్ రూపంలో పౌరసరఫరాల శాఖ కు అప్పగించాల్సి ఉండగా ఇప్పటివరకు నామమాత్రంగానే ప్రభుత్వానికి సీఎంఆర్ పెట్టినట్లు తెలుస్తోంది.సీఎంఆర్ గడువు ముగుస్తున్నప్పటికి సదరు మిల్లు యాజమాన్యం ఇంకా సుమారుగా 1200మెట్రిక్ టన్నుల సీఎంఆర్ బకాయి ఉన్నట్లు సమాచారం.అసలు విషయం ఏమిటంటే 1200 మెట్రిక్ టన్నుల సీఎంఆర్ కు సరిపడా ధాన్యం ఈ మిల్లులో లేదు. ఇప్పటికిప్పుడు సివిల్ సప్లై ఉన్నతాధికారులు ఆ మిల్లులోని ధాన్యం నిల్వలను తనిఖీ చేస్తే కోట్ల రూపాయల ధాన్యం మాయమైన విషయం స్పష్టంగా కనిపిస్తోంది.
పౌరసరఫరాల శాఖ పర్యవేక్షణ ఎక్కడా?
నిత్యం జిల్లాలోని మిల్లుల్లో క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేసే పౌరసరఫరాల శాఖ కు వినాయక మిల్లులోని ధాన్యం నిల్వలు ఎందుకు కనిపించలేదో అర్ధంకాని ప్రశ్న. నిరంతరం మిల్లులను పర్యవేక్షించేందుకు పౌరసరఫరాల శాఖలో డిప్యూటి తహశీల్దార్ లు ఉన్నప్పటికీ సదరు మిల్లులోని ధాన్యం నిల్వలను “డిటి” ఎందుకు గుర్తించలేదో తెలియటంలేదు.అయితే ఈ మిల్లులో కోట్లు విలువ చేసే ధాన్యం మాయమైన విషయం ఉన్నతాధికారులకు తెలుసా? తెలియదా?అనేది పక్కన పెడితే క్షేత్రస్థాయిలో మిల్లులో తనిఖీ చేసే సంబంధిత “డిటి” కి తెలియకుండానే ఉంటుందా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి . ఇప్పటికైనా పౌరసరఫరాల శాఖ అధికారులు స్పందించి మిల్లులో క్షేత్రస్థాయిలో తనిఖీలు చేస్తారా? లేదా?అనేది చూడాల్సిందే.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.







