Viral News | అప్పును రాబట్టేందుకు బ్యాంకు అధికారులు వింతగా ప్రవర్తించారు. మహిళా స్వయం సహాయక సభ్యురాలైన ఓ గిరిజన మహిళ ఇంటి ముందు పొయ్యి అంటించి వంటావార్పు చేశారు. నిరసన పేరుతో ఆమెపై ఒత్తిడి తెచ్చారు. దీంతో ఆ మహిళ భయాందోళలకు గురైంది. బ్యాంకర్ల వైఖరిని చూసి గ్రామస్థులు విస్తుబోయారు. అప్పు వసూలు చేసే విధానం ఇదేనా? అని నిలదీశారు. ఈ ఘటన తెలంగాణలోని జనగామ జిల్లా దేవరుప్పుల మండలంలో ఈ రోజు (ఆదివారం) చోటుచేసుకుంది.
పెదతండాకు చెందిన గుగులోత్ లక్ష్మి.. ఓ మహిళా స్వయం సహాయక సంఘం (Self Help Group (SHG)లో సభ్యురాలు. తెలంగాణ గ్రామీణ బ్యాంకు (Telangana Grameena Bank)లో ఆమెలో రూ. 61 వేల రుణం తీసుకుంది. వడ్డీతో పాటు అసలు చెల్లించడం భారమైంది ఆమెకు. ఈ క్రమంలో బ్యాంకు నుంచి పలుమార్లు రిమైండర్లు వచ్చాయి. చదువురాని ఆమె ఈ విషయాన్ని గమనించలేదు. సకాలంలో ఆమె డబ్బులు కట్టలేకపోవడంతో బ్యాంకు అధికారులు ప్రత్యేకమైన మార్గాన్ని ఎంచుకున్నారు. బ్యాంకు మేనేజర్ శ్రీనివాస్, ఐకేపీ ఏపీఎం వెంకట్‌రెడ్డి, సీసీ సోమనారాయణ, వీవోఏలు కలిసి లక్ష్మి ఇంటి వద్దకు చేరారు. అప్పు కట్టేందుకు ప్రస్తుతం తన వద్ద డబ్బులు లేవని, ఇంకొంత సమయం ఇవ్వాలని ఆమె కోరింది. దీంతో రెచ్చిపోయిన బ్యాంకు అధికారులు ఆమె ఇంటి ముందే పొయ్యి అంటించి వంటావార్పు చేశారు.
Viral News : మళ్లీ వస్తామని వెళ్లిన బ్యాంకర్లు
బ్యాంకర్ల వైఖరిని చూసి భయాందోళనకు గురైన లక్ష్మి తీసుకున్న అప్పులో రూ. 10 వేలను రేపు (సోమవారం) చెల్లిస్తానని, మిగతావి తర్వాత కడతానని చెప్పింది. దీనిని ముందు బ్యాంకు అధికారులు అంగీకరించలేదు. వడ్డీ సహా మొత్తం ఇప్పుడే చెల్లించాలని ఒత్తిడి తెచ్చారు. రుణం తీసుకున్న మహిళ వేడుకోలు, గ్రామస్థుల విమర్శలు వెల్లువెత్తడంతో చివరకు అక్కడి నుంచి వెళ్లేందుకు సిద్ధపడ్డారు. గడువులోగా చెల్లింపులు పూర్తికాకపోతే మరోసారి మళ్లీ వచ్చి ఇలాగే వంటావార్పు చేస్తామని హెచ్చరించి వెళ్లారు.
పెద్ద బాబులను వదిలి.. పేదలపై ప్రతాపం
పెదతండాలో జరిగిన ఈ ఘటన తీవ్ర విమర్శలకు తావిచ్చింది. దీనిని స్థానికులు, సామాజిక కార్యకర్తలు ఖండిస్తున్నారు. పెద్ద రుణ గ్రహీతలు లేదా బడాబాబులను వదిలేసి చిన్న మొత్తంలో అప్పులు తీసుకున్న వారి పట్ల బ్యాంకర్లు ఇలా ప్రవర్తించడం అనైతికమని అభిప్రాయపడుతున్నారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..