Waqf Amendment Bill : వక్ఫ్ సవరణ బిల్లును రాజ్యసభలో ఈ రోజు ప్రవేశపెట్టారు. సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) నివేదికను సమర్పించగా సభ (Rajya Sabha)లో తీవ్ర గందరగోళం నెలకొంది. తాము కమిటీ ఎదుట వ్యక్తపరిచిన అభ్యంతరాలను జేపీసీ నివేదిక నుంచి తొలగించారని ప్రతిపక్ష కాంగ్రెస్ సభ్యులు ఆరోపించారు. ఇది ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని కాంగ్రెస్ మండిపడింది. దీన్ని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు (Kiren Rijiju) ఖండించారు. జేపీసీ (joint committee of Parliament) నివేదిక నుంచి ఏ భాగం కూడా తొలగించలేదని, ప్రతిపక్షాలు అనవసరంగా సమస్యలను సృష్టిస్తున్నారని అన్నారు.
ఇరుపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం
ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge) రాజ్యసభలో మాట్లాడుతూ వక్ఫ్ బిల్లుపై జేపీసీ నివేదికలో అనేక మంది సభ్యులు తమ అభ్యంతరాలను వ్యక్తపరచగా వాటిని తొలగించారని ఆరోపించారు. ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధమని విమర్శించారు. ఇలాంటి నివేదికలను తాము అంగీకరించబోమని అన్నారు. ప్రతిపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేసిన అంశాలు నివేదికలో లేకపోతే దానిని తిరిగి కమిటీకి పంపాలని డిమాండ్ చేశారు. దీనిపై ఇరుపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో ప్రతిపక్ష సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. అనంతరం, సభ ప్రశ్నోత్తర సమయంలో కొనసాగింది.
Waqf Amendment Bill.. ఏమిటా వివాదం?
ముస్లిం సమాజంలో మతపర ప్రయోజనాల కోసం ప్రైవేటు వ్యక్తులు స్వచ్ఛందంగా దానం చేసిన ఆస్తులను నిర్వహించే సంస్థ వక్ఫ్ బోర్డు (Waqf board). దీని పరిపాలనలో సమగ్ర మార్పులను సూచిస్తుంది ఈ కొత్త బిల్లు. ప్రతిపాదిత ముఖ్యమైన సవరణలలో అనేక అంశాలు ఉన్నాయి. ముఖ్యంగా రాష్ట్ర వక్ఫ్ బోర్డుల్లో కనీసం ఇద్దరు ముస్లిమేతర సభ్యులను తప్పనిసరిగా చేర్చడం, ఏ ఆస్తి వక్ఫ్‌కు చెందిందిగా పరిగణించేలా అనే వివాదాలను పరిష్కరించడానికి ప్రభుత్వం ఓ అధికారిని నియమించడం లాంటివి ఉన్నాయి. ఈ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించాలని కేంద్రం భావించగా దీనిపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఈ క్రమంలోనే కేంద్రం జాయింట్ పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేసింది. ఇందులో అధికార ఎన్డీయే ఎంపీలతోపాటు ప్రతిపక్ష పార్టీల సభ్యులు ఉన్నారు. వక్స్ సవరణ బిల్లు (Waqf Amendment Bill.) పై జేపీసీ సమావేశం ఏర్పాటు చేసి అభిప్రాయాలను సేకరించగా ఎన్డీయే సభ్యుల సంఖ్య బలంతో ఈ ప్రతిపాదన ఆమోదం పొందింది. దానిని ఈ రోజు రాజ్యసభలో ప్రవేశపెట్టగా ప్రతిపక్ష సభ్యులు వ్యతిరేకించారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..