- ఫైర్ బ్రాండ్స్‌ను రాజకీయంగా డిస్టర్బ్ చేయడంలో అంతర్యమేమిటో?
- కొండాకు వ్యతిరేకంగా పావులు కదుపుతున్నదెవరు?
- ఎదురించేదిలేదు..? ఢీ కొట్టేది ఉండదు..? కానీ లాబీయింగ్ లో మాత్రం ముందుంటారు..?
Warangal : అధికారంలో ఉన్నా లేకున్నా.. పదవులు వచ్చినా రాకపోయినా.. నిత్యం ప్రజల మధ్యనే ఉంటూ వారితో మమేకమవుతూ రాష్ట్ర రాజకీయాల్లో కొన్ని దశాబ్దాలుగా ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా దీటుగా ఎదుర్కొంటూ ప్రజల గుండెల్లో సుస్థిరంగా నిలిపోయారు కొండా దంపతులు.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంతో మంది అభిమానుల హృదయాల్లో చోటుసంపాదించుకున్నారు ఈ సీనియర్ మాస్ లీడర్లు.. రాజకీయ ప్రత్యర్థులు సైతం కొండాను ఢీ కొట్టాలంటే ఒకటికి వందసార్లు ఆలోచిస్తారంటే వారు ఎంతటి పవర్ ఫుల్ లీడర్లో అర్థం చేసుకోవచ్చు. అలాంటిది కొండా మురళి (Konda Murali) సతీమణి కొండా సురేఖ (Konda Surekha) ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గం(Warangal East)లో ఇప్పుడు కొందరు నాయకులు రాజకీయంగా వారిని డిస్టర్బ్ చేయాలని చూస్తున్నారట. తూర్పు నియోజకవర్గంలో కొంత అసంతృప్తితో ఉన్న కాంగ్రెస్ నాయకులకు లేనిపోని మాటలు చెబుతూ నియోజకవర్గంలో గ్రూపులను తయారు చేస్తున్నారని ఓరుగల్లులో జోరుగా చర్చ జరుగుతోంది.
Warangal East : అసమ్మతి నాయకుల్ని రెచ్చగొట్టే యత్నం..?
వరంగల్ తూర్పు నియోజకవర్గంలో కొండా సురేఖ ఎమ్మెల్యేగా గెలిచి రేవంత్ రెడ్డి క్యాబినెట్‌లో మంత్రి కూడా అయ్యారు. కొండాను గెలిపించడంలో ప్రజల సహకారం తో పాటు కాంగ్రెస్ కార్యకర్తల కృషి కూడా ఉన్నదని చెప్పక తప్పదు. అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిగా ఉన్న కొండా సురేఖ.. రోజువారీ ప్రభుత్వ కార్యక్రమాల్లో బిజీగా ఉంటున్నారు. దీంతో నియోజకవర్గంలో నెలకొన్న సమస్యల పరిష్కారంతోపాటు ప్రజలకు అందుబాటులో ఉంటూ కొండా మురళి అన్నీ తానై వ్యవహరిస్తూ వస్తున్నారు. ఇదే క్రమంలో కొంతమంది కార్యకర్తలు అసంతృప్తిగా ఉండడాన్ని గమనించిన కొందరు నాయకులు కావాలనే అలాంటి కార్యకర్తలను, కొంతమంది సీనియర్లను రెచ్చగొట్టి గ్రూపు రాజకీయాలకు ఆజ్యం పోస్తున్నారని ఓరుగల్లు వ్యాప్తంగా గుసగుసలు వినిపిస్తున్నాయి. స్థానిక ఎమ్మెల్యేను కాదని అసంతృప్తితో ఉన్న వారు గ్రూపు రాజకీయాలకు తెరతీస్తున్న నాయకుల చెంతన చేరితే రాజకీయంగా నష్టపోయే ప్రమాదం లేకపోలేదని స్థానికంగా ప్రచారం జరుగుతోంది.
పావులు కదుపుతున్నదెవరు..?
కొండా సురేఖ మంత్రిగా ఉండడం ఇష్టం లేని ఓ ఇద్దరు సీనియర్ ఎమ్మెల్యేలు కొండా దంపతులపై అటు సీఎం రేవంత్‌కు ఇటు అధిష్ఠానానికి లేనిపోని మాయమాటలు చెప్పే యత్నం చేసినట్లు రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. అంతటితో ఆగని వారు.. కొండా నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీలో ఎలాగైనా గ్రూపులను తయారు చేయాలని, తద్వారా పార్టీలో కొండా దంపతుల ఇమేజ్‌ను డ్యామేజ్ చేయవచ్చని, ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు పావులు కదుపుతున్నట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఓ ఇద్దరు సీనియర్ నేతలను ప్రోత్సహిస్తూ నియోజకవర్గంలో కొండా దంపతులను రాజకీయంగా ఇబ్బందికరమైన వాతావరణం సృష్టించేలా కుట్ర జరుగుతోందని కొండా వర్గీయులు అనుకుంటున్నారు.
వారితో సాధ్యమయ్యే పనేనా ..?
“కొండా ” ను ఢీ కొట్టడం మహామహులతోనే సాధ్యం కాలేదు.. ఉమ్మడి రాష్ట్రంలోనూ ఎవరూ కొండాను వ్యతిరేకంగా ఏ సాహసం చేయలేదు. ఒకరిద్దరు సీనియర్ పొలిటీషియన్లు చేసినా ఇప్పటికీ సక్సెస్ కాలేకపోయిన విషయం తెలిసిందే.. మరి అలాంటి గరీబోళ్ల లీడర్లను (కొండా దంపతులను) ఢీ కొట్టడం వారితో అయ్యేపనేనా..? అని ఓరుగల్లు లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. రాజకీయ చదరంగంలో ఆరితేరిన కొండా మురళీ ఇలాఖాలో గ్రూప్ రాజకీయాలు చేసేలా ఒకరిద్దరు నాయకులను ప్రోత్సహిస్తున్న ఆ సీనియర్ ఎమ్మెల్యేలు కొండా దంపతులను ఢీ కొట్టగలరా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..