వరంగల్, హన్మకొండ జిల్లాల్లో ‘బారాణా’ బ్రోకర్ హవా!
అక్కడ ప్రభుత్వ నిబంధనలు పనిచేయవు.. కలెక్టర్ల ఆదేశాలు చెల్లవు.. కేవలం ఆ ‘బలవంతుడి’ మాటే వేదం. అతనే ‘రెవెన్యూ బ్రోకర్’ (Revenue Broker ) శేఖర్. ఒక సాదాసీదా వ్యక్తిగా మొదలై, నేడు రెండు జిల్లాల రెవెన్యూ వ్యవస్థను తన గుప్పిట్లో పెట్టుకున్న వైనం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
దశాబ్ద కాలంగా ఏకఛత్రాధిపత్యం
గత పదేళ్లుగా వరంగల్, హన్మకొండ జిల్లాల్లో కలెక్టరేట్ల నుంచి మండల ఆఫీసుల వరకు శేఖర్ పేరు వినబడని చోటు లేదు. హన్మకొండ, వరంగల్, నర్సంపేట, పరకాల.. ఇలా డివిజన్ ఏదైనా, పని కావాలంటే శేఖర్ కనుసన్నల్లోనే జరగాల్సిందే. సామాన్యుడికి దక్కని ఆర్డీవో, తహశీల్దార్ల దర్శనం ఈ బ్రోకర్ కు మాత్రం నిత్యకృత్యం.
అధికారులకు ‘పావలా’.. బ్రోకర్ కు ‘బారాణా’
అక్రమ ఆస్తుల రిజిస్ట్రేషన్లు, వివాదాస్పద భూముల సెటిల్మెంట్లు, మ్యుటేషన్లు.. ఇలా ఫైలు ఏదైనా రేటు ఫిక్స్ చేయడంలో శేఖర్ దిట్ట. ఇక్కడ విచిత్రం ఏమిటంటే ప్రభుత్వ యంత్రాంగానికి(అధికారి) దక్కేది కేవలం పావలా (25%) వాటా అయితే..వ్యవస్థను మేనేజ్ చేస్తున్నందుకు శేఖర్ జేబులోకి వెళ్లేది అక్షరాలా బారాణా (75%)అని విశ్వసనీయ సమాచారం.అధికారుల సంతకాలను, సీళ్లను శాసించే స్థాయికి ఈ దళారి ఎదిగాడంటే, వ్యవస్థ ఎంతలా కుళ్లిపోయిందో అర్థం చేసుకోవచ్చు.
Revenue Broker : అధికారుల ‘అతి’ విధేయత: సాక్ష్యం ఇదే!
సాధారణంగా దళారులను దూరంగా ఉంచాల్సిన ఉన్నతాధికారులు, శేఖర్ విషయంలో మాత్రం ‘శిష్యరికం’ చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఇటీవల శేఖర్ మాతృమూర్తి మరణించిన సందర్భంలో..
సీన్ కట్ చేస్తే: సామాన్య ప్రజల వినతులు వినడానికి తీరిక లేని ఉన్నతాధికారులు, ఆర్డీవోలు, తహశీల్దార్ల దండు మొత్తం ఆ బ్రోకర్ ఇంటి ముందు క్యూ కట్టారు. ఒక ప్రభుత్వ అధికారి స్థాయి వ్యక్తి మరణిస్తే వచ్చే ప్రోటోకాల్ కంటే ఎక్కువగా, ఈ దళారి ఇంటికి రెవెన్యూ సిబ్బంది తరలిరావడం చూసి స్థానికులు సైతం విస్తుపోయారని రెవెన్యూ శాఖలో ప్రచారం జరగడం గమనార్హం.
ప్రశ్నార్థకమైన సామాన్యుడి పరిస్థితి
ప్రభుత్వ కార్యాలయాల్లోని బోర్డులపై “లంచం ఇవ్వడం, తీసుకోవడం నేరం” అని రాసి ఉంటుంది. కానీ, శేఖర్ లాంటి దళారులు ఉన్నచోట “లంచం ఇవ్వడం.. శేఖర్ ను కలవడం” తప్పనిసరి అనే సంకేతాలు వెళ్తున్నాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు రెవెన్యూ ఆఫీసుల్లోనే తిష్ట వేసే ఈ ‘అనధికారిక అధికారి’పై చర్యలు తీసుకునే నాథుడే లేరా? అని బాధితులు ప్రశ్నిస్తున్నారు.
రెవెన్యూ దళారీ పై ఏసీబీ నజర్ వేసేనా..?
శేఖరుడిపై నిఘా పెడితే వరంగల్, హన్మకొండ జిల్లాల రెవెన్యూశాఖ లో అవినీతి ప్రక్షాళన జరిగినట్లే..
మరో కథనం ద్వారా రెవెన్యూ శాఖను కుదిపేసే సంచలన కథనం మీ” సర్కార్ లైవ్ “లో








