Warangal News : ఉమ్మడి వరంగల్ జిల్లాలో భారీ వర్షం కురుస్తున్నది. సోమవారం రాత్రి నుంచి ఎడతెరపి లేకుండా వాన కురుస్తూనే ఉంది. వరంగల్, హనుమకొండ, కాజీపేటలో వర్షం దంచికొడుతుండడంతో కాలనీలు, రహదారులు కుంటలు, వాగులను తలపిస్తున్నాయి. బట్టలబజార్, పాతబీటుబజార్ రోడ్లపై భారీగా నీరు నిలిచింది. హంటర్‌రోడ్, ఎన్టీఆర్‌నగర్, రామన్నపేట, శివనగర్, కరీమాబాద్ శాకరాశికుంట, ఎన్‌ఎన్‌నగర్, ఎస్ఆర్ నగర్, గరీబ్నగర్ తదితర కాలనీలు ముంపునకు గురయ్యాయి.. ఇండ్లలోకి నీరు చేరింది. ఉర్సుగుట్ట సమీపంలోని డీకే నగర్ నీటిమునిగింది. దీంతో అక్కడున్న గుడిసెవాసులను అధికారులు పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. ఖమ్మం వెళ్లే ప్రధాన రహదారిలో అండర్ రైల్వే బ్రిడ్జి వద్ద భారీగా వరద నీరు చేరింది. వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.
ఇక హన్మకొండలోని గోకుల్ నగర్, టీ జంక్షన్, అంబేడ్కర్ భవన్ వంటి పలు ప్రాంతాల్లో రహదారులు జలమయమయ్యాయి. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. నాలాలు పొంగి పొర్లడంతో ప్రజలు అనేక అవస్థలు పడుతున్నారు. ప్రజలు అవసరమైతేనే బయటకు రావాలని అధికారులు చెబుతున్నారు.
#warangalrains!!
Massive Flash floods happened in warangal city mainly mulugu road
Khilla warangal fort please avoid travel route stay safe 🚨⚠️ pic.twitter.com/1YYc9q50V5— Warangal Weatherman (@tharun25_t) August 12, 2025
మరోవైపు వరంగల్ జిల్లా నర్సంపేటలో కురిసిన భారీ వర్షంతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. గురిజాల, నర్సంపేట మధ్య ఉన్న కాజ్‌వే పొంగి పొర్లుతుండడంతో రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో గురిజాల, లింగాపురం వెళ్లాల్సిన వారు గిర్నిబావి మీదుగా ప్రయాణిస్తున్నారు. వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నందున చేపల వేటకు వెళ్లవద్దని పోలీసులు హెచ్చరించారు.
వరంగల్ జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో అత్యవసర సహాయం కోసం అధికారులు కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నంబర్లను ప్రకటించారు. ఏదైనా సహాయం అవసరమైన వారు కింది నెంబర్లను సంప్రదించవచ్చు.
- వరంగల్ జిల్లా : 1800 425 3434, 9154225936,
- హనుమకొండ : 1800 425 1115,
- జీడబ్ల్యూఎంసీ : 1800 425 1980, 9701999676
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.
 
								 
															








 
				 
				 
				 
                                                                     
                                                                     
                                                                    