- పరాయి మోజులో పడి కన్నబిడ్డలనే కాల యముడైన అజారుద్దీన్
- లింగ నిర్ధారణ పరీక్షలు, అబార్షన్లు చేసిన డాక్టర్లతో సహా 10 మంది అరెస్ట్
- వరంగల్ పోలీస్ కమిషనర్ వెల్లడించిన సంచలన నిజాలు
Punnelu Swimming Pool Murder case | రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పున్నెలు స్విమ్మింగ్ పూల్ హత్యోదంతం మిస్టరీని వరంగల్ పోలీసులు ఛేదించారు. భార్య, ఇద్దరు కూతుళ్లను ప్రమాదవశాత్తు చనిపోయినట్లు నమ్మించి, అత్యంత కిరాతకంగా స్విమ్మింగ్ పూల్‌లో ముంచి చంపిన భర్త అజారుద్దీన్‌తో పాటు ఈ కుట్రలో భాగస్వాములైన మరో 9 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరో ఇద్దరు లేడీ డాక్టర్లు ప్రస్తుతం పరారీలో ఉన్నారు.
అసలేం జరిగింది?
వరంగల్ జిల్లా ఐనవోలు మండలం పున్నెలు గ్రామానికి చెందిన అజారుద్దీన్ (29), అదే గ్రామానికి చెందిన ఫరహాత్‌ను 2016లో ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి హుమేరా (9), ఆయేషా (6) అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అయితే, కుమారుడు కావాలనే కోరికతో ఉన్న అజారుద్దీన్ కుటుంబ సభ్యులు, గతంలో ఫరహాత్ గర్భం దాల్చిన ప్రతిసారి లింగ నిర్ధారణ పరీక్షలు చేయించి, ఆడపిల్ల అని తెలియగానే బలవంతంగా అబార్షన్లు చేయించారు.
మరో వివాహం కోసమే ఈ ఘాతుకం
నిందితుడు అజారుద్దీన్ తన దూరపు బంధువైన ఓ మైనర్ బాలికపై కన్నేశాడు. ఆమెను పెళ్లి చేసుకుంటానని ప్రతిపాదించగా.. “నీకు అప్పటికే భార్య, పిల్లలు ఉన్నారు, నిన్ను పెళ్లి చేసుకోను” అని ఆ బాలిక తిరస్కరించింది. తన పెళ్లికి భార్య, పిల్లలే అడ్డని భావించిన నిందితుడు, వారిని అడ్డు తొలగించుకోవాలని పథకం వేశాడు. మార్చిలో ఫరహాత్ మళ్లీ గర్భం దాల్చడంతో, అబార్షన్ విషయంలో గొడవపడి ఇదే అదనుగా వారిని హతమార్చాలని నిర్ణయించుకున్నాడు.
పథకం ప్రకారం హత్యాకాండ
ఈ నెల 1వ తేదీ రాత్రి 7.50 గంటల సమయంలో ఐస్ క్రీం తినిపిస్తానని నమ్మించి భార్య పిల్లలను తన స్విమ్మింగ్ పూల్ వద్దకు తీసుకెళ్లాడు. ముందుగానే అక్కడ సిసి కెమెరాలు, విద్యుత్ కనెక్షన్ తొలగించిన నిందితుడు.. ముగ్గురిని బలవంతంగా నీటిలోకి నెట్టి, వారు ప్రాణాలు విడిచే వరకు నీటిలో ముంచి దారుణంగా చంపేశాడు. అనంతరం వారు ప్రమాదవశాత్తు పడి చనిపోయారని నమ్మించే ప్రయత్నం చేశాడు.
Swimming Pool Murder case : ముఠా గుట్టు రట్టు
మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు టెక్నాలజీ సాయంతో నిందితుడి అసలు రంగు బయటపెట్టారు. ఈ కేసులో సహకరించిన ఆర్ఎంపి నరేష్, ల్యాబ్ టెక్నీషియన్ మనోహర్, మందుల షాపు యజమాని సట్ల రాజు, నర్సు స్రవంతితో పాటు నిందితుడి కుటుంబ సభ్యులను అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న డాక్టర్ రవళి, డాక్టర్ పూర్ణిమ కోసం గాలిస్తున్నారు.
నిందితుల వివరాలు:
ప్రధాన నిందితుడు: ఎం.డి. అజారుద్దీన్
కుటుంబ సభ్యులు: చాంద్ పాషా, సలీహా, షరోద్దీన్
వైద్య సిబ్బంది: బసిక స్రవంతి (నర్సు), బాల్నె పార్ధు, మనోహర్, నరేష్, సట్ల రాజు, వాకుదోట్ భద్రు. ఈ కేసును అత్యంత వేగంగా ఛేదించిన డీసీపీ అంకిత్ కుమార్, ఏసీపీ వెంకటేష్ , పర్వతగిరి సిఐ రాజగోపాల్, గీసుగొండ ఇన్స్ స్పెక్టర్ విశ్వేశ్వర్,మామూనూర్ ఇన్స్ స్పెక్టర్ శ్రీనివాస్, ఐనవోలు ఎస్ , పర్వతగిరి, మామూనూర్ ఎస్.ఐ లు శ్రీనివాస్, ప్రవీణ్, శ్రీకాంత్, కానిస్టేబుళ్లు హేమకుమార్, శ్రీనివాస్ లను పోలీస్ కమిషనర్ ప్రత్యేకంగా అభినందించారు.








