అమెరికాలోని అధ్యక్ష భవనం వైట్‌హౌస్ (White House)పై దాడి యత్నం కేసులో తెలుగు సంతతికి చెందిన 20 ఏళ్ల యువకుడు సాయి వర్షిత్ కందుల (ai Varshith Kandula)కు అక్కడి ప్రభుత్వం ఎనిమిదేళ్ల జైలు శిక్షను విధించింది. నాజీ సిద్ధాంతాలకు ప్రేరేపితుడైన అతడు అమెరికా ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కూలగొట్టడమే లక్ష్యంగా ఈ దాడి చేశాడని నిర్ధారణ కావడంతో ఈ శిక్షణు విధిస్తున్నామని అక్కడి న్యాయస్థానం పేర్కొంది. సాయి వర్షిత్ కందుల హైదరాబాద్ (Hyderabad)లోని చంద్రానగర్ ప్రాంతానికి చెందినవాడు. అమెరికా ( America White House )లో అతడు గ్రీన్ కార్డ్ హోల్డర్.
కేసు పూర్వపరాలు
కోర్టులో సమర్పించిన పత్రాల వివరాల ప్రకారం… 2023 మే 22న సాయంత్రం సాయి వర్షిత్ అమెరికాలోని మిస్సోరీ రాష్ట్రంలోని సెయింట్ లూయిస్ నుంచి వాషింగ్టన్ డిసి (Washington DC) వెళ్లాడు. సాయంత్రం 5:20 గంటల ప్రాంతంలో డల్లస్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న అతడు రాత్రి 6:30కి ఒక ట్రక్కును అద్దెకు తీసుకున్నాడు. అందులో ఇంధనం నింపుకొని భోజనం చేసి, వైట్ హౌస్ వైపు బయల్దేరాడు. రాత్రి 9:35 గంటలకు వైట్ హౌస్ ( White House ) చేరుకున్నాడు. ప్రెసిడెంట్ పార్క్ రక్షణ కోసం ఏర్పాటు చేసిన ట్రాఫిక్ బారియర్స్‌ను ట్రక్‌తో ఢీకొట్టాడు. మొదట్లో అతడు ట్రక్‌ను ఢీకొట్టిన తర్వాత, వెనక్కి వెళ్లి మళ్లీ ముందుకు నడిపి రెండోసారి ఢీకొట్టాడు. రెండోసారి ఢీకొట్టినప్పుడు ట్రక్ పూర్తిగా దెబ్బతింది. దీంతో ఇంజిన్ నుంచి పొగ రావడం మొదలైంది.
నాజీ జెండాను ప్రదర్శించి..
ఆ తర్వాత ట్రక్కు వెనుక భాగంలో తన బ్యాగ్ నుంచి ఒక పెద్ద నాజీ జెండాను బయటకు తీసిన సాయి వర్షిత్ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఆ ప్రదేశంలో ప్రదర్శించాడు. దీంతో పోలీసులు అతడిని వెంటనే అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన జో బైడన్ అధికారంలో ఉన్న సమయంలో జరిగింది.
ప్రభుత్వాన్ని కూలగొట్టడమే లక్ష్యం : న్యాయస్థానం
నాజీ భావాజాలం (Nazi ideology) గల సాయివర్షిత్ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన అమెరికా ప్రభుత్వాన్ని కూలగొట్టడమే లక్ష్యంగా ఈ దాడికి పాల్పడ్డాడని అక్కడి న్యాయస్థానం తెలిపింది. అవసరమైతే దేశ అధ్యక్షుడిని హతమార్చాలను కూడా అతడు చూశాడని పేర్కొంది. రాజకీయ శక్తిని స్వాధీనం చేసుకోవడమే అతడి ప్రధాన లక్ష్యమని విచారణలో వెల్లడైందని వివరించింది. ఈ నేరాన్ని సాయి వర్షిత్ అంగీకరించాడని, దీంతో అతడికి ఎనిమిదేళ్ల జైలు శిక్ష విధిస్తున్నామని తెలిపింది. జైలుశిక్ష పూర్తయిన తర్వాత మరో మూడు సంవత్సరాలపాటు అతడు పర్యవేక్షణలో ఉండాల్సి ఉంటుందని పేర్కొంది.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..