Yadadri Bhuvanagiri News | వివాహేతర సంబంధం ఓ పచ్చని సంసారాన్ని విచ్ఛిన్నం చేసింది. తన వివాహేతర సంబంధానికి అడ్డుగా మారాడన్న కోపంతో భార్య ప్రియుడితో కలిసి పక్కా ప్రణాళిక ప్రకారం కట్టుకున్న భర్తను అంతమొందించింది. రోడ్డు ప్రమాదంగా నమ్మించే ప్రయత్నం చేసినా… చివరికి పోలీసుల విచారణతో కుట్ర బయటపడింది. యాదాద్రి భువనగిరి జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఘాతుకం అందరినీ తీవ్రంగా కలిచివేసింది.
పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. యాదాద్రి భువనగిరి జిల్లా (Yadadri Bhuvanagiri District) ఆత్మకూరు మండలం పల్లెర్లకు చెందిన వస్తువుల స్వామి (38) ను మోత్కూరు మండలం దాచారం గ్రామానికి చెందిన స్వాతితో 20 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి వీరికి ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. స్వామి స్వగ్రామంలోనే ఉంటూ భువనగిరిలో ఓ ట్రాక్టర్ షోరూంలో మేనేజర్ గా పనిచేస్తున్నాడు. భార్య స్వాతి కూడా ఇదే షో రూంలో పనిచేస్తోంది. ఈ క్రమంలో తుర్కపల్లి మండలం పల్లెపహాడ్ కు చెందిన సాయికుమార్ తో పరిచయం ఏర్పడి అది వివాహేతర సంబంధానికి దారి తీసింది. విషయం స్వామికి తెలియడంతో కొద్దిరోజులుగా కుటుంబంలో గొడవలు మొదలయ్యాయి. అయితే తన సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను తొలగించుకునేందుకు భార్య స్వాతి తన ప్రియుడు సాయికుమార్ తో కలిసి పథకం రచించింది.
కాగా సోమవారం స్వామి తన స్నేహితుడు వీరబాబుతో కలిసి భువనగిరి బయలుదేరాడు. దీంతో స్వాతి తన తమ్ముడు మహేష్, ప్రియుడు సాయికుమార్ కు చెప్పింది. మహేష్‌తో కలిసి సాయికుమార్ భువనగిరిలో అద్దె కారులో వచ్చి మోటకొండూరు మండలం కాటేపల్లి సమీపంలోని బ్రిడ్జి దాటగానే స్వామి బైక్ ను సాయికుమార్ బలంగా ఢీకొట్టాడు. స్వామి రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్లుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. కాగా బైక్ ను 50 మీటర్ల దూరం ఈడ్చుకువెళ్లడంతో స్వామి మృతిచెందగా, బైక్ పై వెనక కూర్చున్న వీరబాబు తీవ్రంగా గాయపడ్డాడు.
అయితే స్వామి మృతిపై తమకు అనుమానం ఉందని కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు స్వాతిని, బావమరిది మహేష్ ను అదుపులోకి తీసుకుని విచారించడంతో అసలు బాగోతం బయటపడింది..స్వాతి కాల్ డేటా ఆధారంగా మొత్తం కుట్రను రాబట్టారు. కాగా కుటుంబ సభ్యలతోపాటు స్వాతి కూడా ఎవరికీ అనుమానం రాకుండా స్వామి మృతదేహం వద్ద రోదించిందని స్థానికులు తెలిపారు. ఈ ఘటనలో స్వాతి, మహేష్, సాయికుమార్ ను పోలీసులు అరెస్టు చేశారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.