Warangal Outer Ring Road | తెలంగాణలోని రెండో అతిపెద్ద నగరమైన వరంగల్ ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ రైల్వే లైన్ నిర్మించడానికి కేంద్రంలోని మోదీ ప్రభుత్వం సుముఖంగా ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఓరుగల్లు నగరం చుట్టూ రైల్వే లైన్ వేయడానికి కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ సానుకూలంగా స్పందించారని రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రకటించారు. రాష్ట్రంలో ఉన్న బీజేపీ ఎంపీలు, కేంద్ర మంత్రులు రాష్ట్ర అభివృద్ధిలో తమతో కలిసి రావాలని కోమటిరెడ్డి పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం అన్నివిధాలా సహాయ సహకారాలు అందిస్తోందని ఆయన చెప్పారు.
దివిటిపల్లి (Divitipalli)లో అమర రాజా (Amara Raja) గిగా ఫ్యాక్టరీ నిర్మాణపనులను ప్రారంభించేందుకు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ హైదరాబాద్‌కు శనివారం చేరుకున్నారు. ఈమేరకు శంషాబాద్ విమానాశ్రయంలో రాష్ట్ర మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కొండా సురేఖ, సీతక్క, పలువురు ఎంపీలు సమావేశమయ్యారు. కేంద్రమంత్రితో సమావేశం తర్వాత మంత్రి కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న రైల్వే ప్రాజెక్టులపై చర్చించామని.. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. వీటిపై కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారని.. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, కాజీపేట రైల్వే జంక్షన్ నిర్మాణాలపై కేంద్ర మంత్రి సానుకూలంగా మాట్లాడారని చెప్పారు.
కాగా హైదరాబాద్ తర్వాత రాష్ట్రంలో అతిపెద్ద మహానగరంగా తెలంగాణకు రెండో రాజధాని వరంగల్ అని మంత్రి సీతక్క తెలిపారు. వరంగల్‌ను అన్నివిధాలా అభివృద్ధి చేయడానికి తమ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కట్టుబడి ఉన్నారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న రైల్వే ప్రాజెక్టుల విషయంలో కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని మంత్రి కొండా సురేఖ సంతోషం వ్యక్తం చేశారు.
Warangal Outer Ring Road : మొత్తం 69 కిలోమీటర్లు..
ఇదిలా ఉండగా వరంగల్ నగరం చుట్టూ నిర్మిస్తున్న ఔటర్ రింగ్ (Warangal Outer Ring Road) రోడ్డు 69 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. ఈ ఔటర్ రింగ్ రోడ్డు మీద ప్రతీ 20 కిలోమీటర్లకు సర్వీస్ రోడ్లు నిర్మించనున్నారు. ఇది హైదరాబాద్-వరంగల్ దారిలో రాంపూర్ గ్రామంలోని దిల్లీ పబ్లిక్ స్కూల్ నుంచి ధర్మసాగర్, ఉనికిచర్ల, దేవన్నపేట, కోమటిపల్లి, భీమారం, చింతగట్టు, పలివేల్పుల, ముచ్చర్ల, పెగడపల్లి, వంగపహాడ్, ఆరేపల్లి ధర్మారం వరకు ఉంటుంది. ఈ ఎక్స్ ప్రెస్ వే కి అక్టోబర్ 2017లో అప్పటి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ 69 కిలోమీటర్ల పొడవైన రహదారిని భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్ఏఐ), తెలంగాణ ప్రభుత్వ రోడ్లు, భవనాల శాఖ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. నగరం చుట్టూ 41 కిలోమీటర్ల ఔటర్ రింగు రోడ్డు నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందించారు. వరంగల్ ఔటర్ రింగు రోడ్డును మూడు దశల్లో నిర్మిస్తారు. మొదటి దశలో 20 కి.మీ, రెండవ దశలో 11 కి.మీ, మూడవ దశలో 10 కిలోమీటర్లు నిర్మించనున్నారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..