Siddipet : రాష్ట్రంలో నెలకొన్న యూరియా కొరత (Urea Shortage )పై బీఆర్ఎస్ తీవ్రంగా స్పందించింది. అసెంబ్లీలో రైతుల సమస్యలపై చర్చకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధం కాలేదని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు (BRS MLA Harish Rao) విమర్శించారు. వరదలు, యూరియా సమస్యలు పక్కన పెట్టి బురద రాజకీయాలకే ప్రాధాన్యత ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అసెంబ్లీలో యూరియా కొరత, వరదల మీద చర్చ చేయాలని బిఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తే, మాకు యూరియా, వరదల కంటే బురద రాజకీయాలే ముఖ్యమన్నారు. ప్రజా సమస్యలను గాలికి వదిలి, కక్ష సాధింపు చర్యలే లక్ష్యంగా ఆదరాబాదరాగా ఆదివారం సభను నిర్వహించి, అర్ధంతరంగా, అసంపూర్తిగా ముగించారు. ఈ ప్రభుత్వానికి రైతుల కష్టాలపై చర్చించే సమయం లేదు, సామర్థ్యం లేదు.
Urea Shortage : కాంగ్రెస్ చేతగాని పాలనతోనే..
కాంగ్రెస్ చేతగాని, దద్దమ్మ పాలన వల్ల పంట పొలాల్లో ఉండాల్సిన రైతులు యూరియా కోసం నడిరోడ్ల వెంట బారులు తీరుతున్నారు. ఆధార్ కార్డు, పాస్ బుక్కులు చేత పట్టుకొని యూరియా బస్తా కోసం పడిగాపులు కాస్తున్నారు. పండుగ లేదు..పబ్బం లేదు..వాన లేదు.. ఎండ లేదు…రాత్రి లేదు…పగలు లేదు క్యూలో నిలబడుతున్నరు. అలసి సొలసి పడిపోతున్నారు. ఓపిక లేక క్యూలో చెప్పులు, పాస్‌బుక్కులు, అట్ట డబ్బాలు, ఖాళీ సీసాలు, రాళ్లు పెట్టి రోజుల పాటు నిరీక్షిస్తున్నరు.
‘పత్తి పూత దశతో ఉంది.. ఇప్పుడు యూరియా వేయకపోతే దిగుబడి రాదు’ అని ఒక రైతు. ‘వరి పొట్ట దశలో ఉంది.. యూరియా చల్లకపోతే పంట వేసి వ్యర్థం’ అని మరొక రైతు పడుతున్న ఆవేదన చూస్తే గుండె తరుక్కుపోతోంది. రాష్ట్రంలో నెలకొన్న యూరియా సంక్షోభానికి నిన్న సిద్దిపేట జిల్లా జగదేవ్‌పూర్‌లో కట్టలు తెంచుకున్న రైతుల ఆగ్రహమే నిదర్శనం అని హరీష్ రావు అన్నారు.
ప్రభుత్వ యంత్రాంగం మీద అసహనంతో జుట్లు పట్టుకొని కొట్టుకోవాల్సి రావడమే కాంగ్రెస్ వైఫల్యానికి నిదర్శనం. ఎక్కడిక్కడ హైవేలెక్కి ధర్నాలు చేస్తున్న రైతన్నల ఆగ్రహ జ్వాలలే నిదర్శనం. ఇది కాంగ్రెస్ తెచ్చిన సంక్షోభం.. యూరియా అడిగిన పాపానికి రైతుల చెంపలు చెల్లుమనిపించిన సోకాల్డ్ ప్రజా పాలన ఇది. 22 నెలల పాలనలో యావత్ తెలంగాణ రైతాంగాన్ని నడి రోడ్డు మీదకు ఈడ్చిన దుర్మార్గ పాలన ఈ కాంగ్రెస్ ప్రభుత్వానిది, రేవంత్ రెడ్డిది. కేసీఆర్ పాలనలో సకాలంలో సరఫరా అయిన యూరియాను ఇప్పుడు ఎందుకు చేయలేకపోతున్నారు. పాలకులు మారగానే పాలసీలు మారిపోతాయా? రైతుల కష్టాలు తీర్చని ప్రభుత్వం ఉండి ఏం లాభం. రాష్ట్రంలో రెండు నెలలుగా ఇదే పరిస్థితి కొనసాగుతున్నా, కాంగ్రెస్ ప్రభుత్వం మొద్దునిద్ర నటిస్తుండటం దారుణమని హరీష్ రావు మండిపడ్డారు .
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.
 
								 
															








 
				 
				 
				 
                                                                     
                                                                     
                                                                    