Hyderabad | పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా గ్రూప్-2 నియామకాలలో ఎంపికై స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో 14 మంది కొత్తగా సబ్ రిజిస్ట్రార్లుగా నియమితులయ్యారు. వీరంతా మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డిని (Ponguleti Srinivas Reddy) సచివాలయంలో గురువారం మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. వారిని మంత్రి అభినందించి ఇండియన్ స్టాంప్ యాక్ట్ బుక్‌లను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ . స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో చాలా జాగ్రత్తగా పనిచేయాల్సి ఉంటుందని, ఎలాంటి ప్రలోభాలకు తలొగ్గకుండా నిజాయతీ, నిబద్దత, అంకితభావం, క్రమశిక్షణతో పనిచేసి ప్రభుత్వ పేరు ప్రతిష్టలను ఇనుమడిరపజేయాలని ఉద్బోధించారు.
తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే యువతకు ఉద్యోగావకాశాలు (Government Jobs) లభిస్తున్నాయని అన్నారు. ఆనాటి ప్రభుత్వం చేపట్టిన అరకొర ఉద్యోగ నియామక ప్రక్రియలలో చోటుచేసుకున్న అక్రమాలు, పేపర్ లీకేజీలు, అసమర్ద పరీక్షా నిర్వహణ వల్ల అర్హులైన యువతకు ఉద్యోగాలు రాని పరిస్ధితి దాపురించిందన్నారు. ఈ పరిస్ధితుల్లో ఇందిరమ్మ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మేరకు ఉద్యోగాల భర్తీ ప్రక్రియకు అత్యంత ప్రాధాన్యమిచ్చిందన్నారు. అందువల్లే గత 20 నెలల పాలనా కాలంలో ఇప్పటివరకు 70 వేలకు పైగా ఉద్యోగాల భర్తీ జరిగిందని వివరించారు. అంతేగాక నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించాలన్న ఆలోచన మేరకు వివిధ శాఖల తరపున కార్యాచరణను విస్తృతం చేశామని మంత్రి పొంగులేటి చెప్పారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న రెవెన్యూ శాఖలో జీపీవోల నియామకం, హౌసింగ్ విభాగంలో అవుట్ సోర్సింగ్ పద్దతిలో దాదాపు 350 మంది ఇంజనీర్లు, సర్వే విభాగంలో 3465 మంది లైసెన్స్‌డ్ సర్వేయర్లకు ఉపాధి అవకాశాలు కల్పించామని వివరించారు. కొత్తగా ఉద్యోగాల్లో చేరే అధికారులు సామాన్య ప్రజలే లక్ష్యంగా సేవలు అందించాలని, తద్వారా ఉద్యోగానికి న్యాయం చేసి ప్రభుత్వానికి పేరు ప్రతిష్టలు తేవాలని సూచించారు.
 
								 
															








 
				 
				 
				 
                                                                     
                                                                     
                                                                    