- నెలలుగా రహదారి మరమ్మతులు లేక తీవ్ర ఇబ్బందులు
- స్కూల్ బస్సులు, భారీ వాహనాలు ప్రమాదకర పరిస్థితుల్లో ప్రయాణం
Warangal | వరంగల్ 15వ డివిజన్ పరిధిలోని ప్రగతి ఇండస్ట్రియల్ ఏరియా (Pragathi Industrial Area) నుంచి రెడ్డిపాలెం (Reddypalem) వెళ్లే రోడ్డు పూర్తిగా ధ్వంసమై నెలలు గడుస్తున్నా పట్టించుకున్న నాథుడే కరువయ్యారు. లోతైన గుంతలు పడి రాళ్లు బురదతో నిండిపోయి ఉండడంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. అయితే ఇదే రోడ్డు నుంచి రెండు ప్రైవేటు పాఠశాలలకు చెందిన సుమారు 25 స్కూల్ బస్సులు విద్యార్థులతో నిత్యం రాకపోకలు సాగిస్తుంటాయి. కీర్తినగర్, గొర్రెకుంట, లేబర్ కాలనీ ప్రాంతాల నుంచి పలువురు తమ పిల్లలను ద్విచక్రవాహనాలపై పిల్లలను ఇదే రోడ్డు మీదుగా తీసుకెళ్తుంటారు.
భారీ వాహనాలతో నిత్యం రద్దీ..
అలాగే పత్తి, మిర్చి, ఇతర వ్యవసాయ ఉత్పత్తులతో భారీ లారీలు, డీసీఎంలు ట్రాలీల రాకపోకలతో ఈ రోడ్డు ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. దీంతో ఈ రహదారిలో వెంకటసాయి కోల్డ్ స్టోరేజ్ ఎదురుగా భారీ గుంతలు ఏర్పడ్డాయి. వేసవిలో ఈ రోడ్డుపై దట్టమైన దుమ్ము వ్యాపిస్తుండగా వర్షాకాలంలో గుంతలు మరీ లోతుగా మారి బురదదో నిండిపోతున్నాయి. దీంతో తరచూ వాహనదారులు గుంతల్లో పడి (Road Accidents) గాయాలపాలవుతున్నారు.
ఈ రోడ్డును మరమ్మతులు చేయాలని పలువురు జీడబ్ల్యూఎంసీ (GWMC) అధికారులకు ఫిర్యాదులు చేసిన సందర్భాలు అనేకం.. అయితే వారు కేవలం ఈ గుంతల్లో మొరంతో చదును చేసి చేతులు దులుపుకుంటున్నారు. కాంట్రాక్టర్లు, అధికారులు కుమ్మక్కై కేవలం బిల్లుల కోసమే తాత్కాలిక మరమ్మతులు చేపడుతున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.
 
								 
															








 
				 
				 
				 
                                                                     
                                                                     
                                                                    