Betting racket : హైదరాబాద్ నగరంలో అక్రమంగా నడుస్తున్న ఆన్‌లైన్ బెట్టింగ్ రాకెట్ (online betting racket) గుట్టును పోలీసులు రట్టు చేశారు. కమిషనర్ టాస్క్‌ఫోర్స్, వెస్ట్‌జోన్ పోలీసులు ఘన్సీబజార్, పూరానాపుల్, షాలీబండ, హయత్‌నగర్ ప్రాంతాల్లో ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించి ఒక బుకీ (bookie), ఐదుగురు ఏజెంట్లు (agents), ఒక పంటర్ (punter)ను అరెస్టు చేశారు. 55 మొబైల్ ఫోన్లు, 3 ల్యాప్‌టాప్‌లు, 60 డెబిట్ కార్డులు, భారీ నగదును స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఆన్‌లైన్ బెట్టింగ్ పాయింట్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. మొత్తం విలువ రూ. 23,51,505 (ఒక పాయింట్ = ఒక రూపాయి).
ఈ గ్యాంగ్ ప్రముఖ ఆన్‌లైన్ బెట్టింగ్ ప్లాట్‌ఫాంలు అయిన SKYEXCH, RADHE EXCHANGE, 99 RACES, 365 RACES, Placebet999 లాంటి యాప్‌ల ద్వారా అక్రమ బెట్టింగ్ నిర్వహిస్తూ డబ్బు సంపాదిస్తున్నట్టు బయటపడింది. అరెస్టయిన వారిలో బుకీలలో ఘన్సీబజార్ చార్మినార్ ప్రాంతానికి చెందిన గిరీశ్ అగర్వాల్ , పెట్లబుర్జ్‌కు చెందిన మానిందర్ పాల్ సింగ్, రాజస్థాన్‌కు చెందిన పవన్ కుమార్ శర్మ , కిషన్ శర్మ, షాలీబండకు చెందిన మోహిత్ అగర్వాల్, హయత్‌నగర్‌కు చెందిన రాహుల్ అగర్వాల్ ఉన్నారు. పురానాపుల్‌కు చెందిన పంటర్ సురేష్ సోని ఉన్నాడు.
Betting racket ఆపరేషన్ ఎలా జరిగింది?
పోలీసులు మురళీనగర్, పూరానాపుల్, బహదూర్‌పుర వద్ద మాటువేసి సురేష్ సోనీ అనే పంటర్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతను Placebet999 యాప్‌లో బెట్టింగ్ చేస్తున్నట్టు తేలింది. విచారణలో అతడు గిరీశ్ అగర్వాల్ దగ్గర నుంచి పాయింట్లు కొనుగోలు చేసి ఆడుతున్నట్టు ఒప్పుకున్నాడు. దీంతో పోలీసులు గిరీశ్ ఇంటిపై దాడి చేసి అతడిని, అతని ఏజెంట్లను అరెస్టు చేశారు.
బెట్టింగులు మొదలు పెట్టిందిలా..
ఆన్‌లైన్ బెట్టింగ్ సైట్ల గురించి తెలుసుకున్న గిరీశ్ అగర్వాల్ వీటి ద్వారా ఎక్కువమంది బెట్టింగ్‌కు ఆసక్తి చూపుతున్నారని గమనించాడు. ఈ క్రమంలో అతడు ఏజెంట్లను ఏర్పాటు చేసి. వారి పేర్లపై కొత్త బ్యాంక్ అకౌంట్లు తెరిపించాడు. ఖాతా తెరిచిన ఏజెంట్‌కు రూ. 3,000 ఇచ్చాడు. అన్ని ఖాతాల నియంత్రణను తన వద్ద ఉంచుకున్నాడు. ఆ అకౌంట్ల ద్వారా ఆన్‌లైన్ బెట్టింగ్ నిర్వహిస్తూ పెద్ద ఎత్తున డబ్బు లావాదేవీలు జరిగాయి.
అదనపు డీసీపీ ఏమన్నారంటే…
టాస్క్‌ఫోర్స్ అదనపు డీసీపీ ఇక్బాల్ సిద్ధిఖీ (Task Force Adll DCP Mohd Iqbal Siddiqui) మాట్లాడుతూ “అక్రమంగా ఆన్‌లైన్ బెట్టింగ్ ప్లాట్‌ఫాంలు పెరుగుతున్నాయి. ప్రజలు ఆకర్షితులవుతున్నారు. కానీ వీటివల్ల మోసపోవడం, ఆర్థిక నష్టం వాటిల్లే అవకాశం ఎక్కువ. కాబట్టి ఎవరూ ఇలాంటి అక్రమ కార్యకలాపాల్లో పాల్గొనొద్దు.” అన్నారు. ఈ కేసులో పట్టుబడ్డ నిందితులను కోర్టుకు హాజరుపరిచి, మరిన్ని అనుబంధ నెట్వర్క్‌లపై నిఘా పెట్టామని తెలిపారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.








