TGSRTC | హైదరాబాద్ : ఆర్టీసీ ఉద్యోగులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్‌ఆర్‌టీసీ) గుడ్ న్యూస్ చెప్పింది. పదవీ విరమణ పొందిన ఉద్యోగులు తమ రోగాల చికిత్స కోసం ఇకపై హైదరాబాద్‌లోని తార్నాకలోని ఆర్టీసీ ఆస్పత్రికి రావాల్సిన అవసరం లేదు. రాష్ట్రంలోని జిల్లా కేంద్రాల్లో వీరికోసం ప్రత్యేకంగా డిస్పెన్సరీలను (TGSRTC dispensaries) ఏర్పాటు చేయాలని కార్పొరేషన్ యోచిస్తోంది.
ఇందుకోసం అవసరమైన వైద్య సిబ్బంది, పరికరాలను కూడా కొనుగోలు చేస్తోంది. అయితే, ఈ డిస్పెన్సరీల్లో అత్యవసర వైద్యచికిత్సలు ఉండవు. అర్టీసీ కార్మికులందరికీ సాధారణ చికిత్సలను ఇందులో అందించనున్నారు. కార్పొరేషన్‌కు చాలా కాలంగా ఈ డిస్పెన్సరీలను ఏర్పాటుచేయాలని నిర్ణయించినప్పటికీ కార్పొరేషన్ వద్ద తగినంత నిధులు లేకపోవడంతో ఆ దిశగా చర్యలు తీసుకోలేదని తెలిసింది. ఇటీవల ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ డిస్‌పెన్సరీల ఏర్పాటుకు, ఆసుపత్రులుగా అప్‌గ్రేడ్ చేసేందుకు అవసరమైన నిధులను కేటాయిస్తూ హామీ ఇచ్చారు.
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 14 ఆర్టీసీ డిస్పెన్సరీలు ఉన్నాయి. అందులో నాలుగు హైదరాబాద్‌లో ఉన్నాయి. కానీ, కొన్ని డిస్పెన్సరీలలో అవసరమైన సంఖ్యలో వైద్యులు, వైద్య సిబ్బంది, పరికరాలు, మందులు లేవని తెలిసింది. అయితే అన్ని దవాఖానలకు వైద్యులను కేటాయించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, రాష్ట్ర ప్రభుత్వం అరడజను మంది వైద్యులను కేటాయించగా, మిగిలిన వైద్యులు, సాంకేతిక నిపుణులను ఆర్టీసీ అవుట్‌సోర్సింగ్ ద్వారా నియమించనుంది. వీరు స్థానికంగా డిస్పెన్సరీలో అందుబాటులో ఉంటూ పూర్తిస్థాయిలో చికిత్సలను అందిస్తారు.
అయితే, అత్యవసర చికిత్స అవసరమైన రోగులు ఆర్టీసీ రిఫరల్ జాబితాలోని ఆర్టీసీ ప్రధాన ఆసుపత్రి లేదా ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లే వరకు ప్రాథమిక చికిత్స అందించనున్నారు. అలాగే ఈ దవాఖానల్లో అన్ని రకాల మందులను అందుబాటులో ఉంచనున్నారు. గతంలో ఆర్టీసీ ప్రధాన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారు మందుల కోసం ప్రతిసారీ హైదరాబాద్ రావాల్సి వచ్చేది. ఇప్పుడు ఈ కొత్త దవాఖానల్లో ఉచితంగా మందులు అందజేయనున్నారు. మరోవైపు జిల్లా కేంద్రాల్లో డిస్పెన్సరీల ఏర్పాటు నిర్ణయంలో భాగంగా తాజాగా నాగర్ కర్నూల్ జిల్లాలో దవాఖానను ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లోనూ ఇలాంటి సౌకర్యాలు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్, వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..








