Ocean County : అమెరికాలో ఓ భారతీయుడు హత్యకు గురైన ఘటనలో ఐదుగురు భారత సంతతికి చెందిన వ్యక్తులపై కేసులు నమోదయ్యాయి. 2024 అక్టోబరు 22న లాస్ వెగాస్‌లోని మాంచెస్టర్ టౌన్‌షిప్ వద్ద ఈ హత్య జరిగింది. కుల్దీప్ కుమార్ (35) అనే భారతీయుడు హతమయ్యాడు. ఈ క్రమంలో విచారణ చేపట్టగా సౌత్ ఓజోన్ పార్క్, న్యూయార్క్‌కు చెందిన 34 ఏళ్ల సందీప్ కుమార్ దీనికి సూత్రధారుడని వెల్లడైంది. మరో నలుగురితో కలిసి అతడు ఈ హత్యకు పాల్పడ్డాడని తమ విచారణలో వెల్లడైంది. ఈ మేరకు ఓసియన్ కంట్రీ ప్రాసిక్యూటర్ బ్రాడ్లీ బిల్హైమర్, న్యూజెర్సీ రాష్ట్ర పోలీసు కల్నల్ ప్యాట్రిక్ కాలహాన్ తాజాగా విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపారు. కుల్దీప్ కుమార్ హత్యకు సందీప్ కుమార్ సూత్రధారుడు కాగా మిగతా నిందితులు సౌరవ్ కుమార్ (23), గౌరవ్ సింగ్ (27), నిర్మల్ సింగ్ (30), గురుదీప్ సింగ్ (22)గా కేసు నమోదైందని వివరించారు.వీరిని అరెస్టు చేసి జైలుకు పంపామని చెప్పారు.
కుళ్లిన మృతదేహం లభ్యం
మాంచెస్టర్ టౌన్‌షిప్‌లో గ్రీన్‌వుడ్ వైల్డ్‌లైఫ్ మేనేజ్‌మెంట్ ఏరియాలో ఒక మృతదేహం ఉన్నట్లు Ocean County ప్రాసిక్యూటర్ కార్యాలయానికి 2024 డిసెంబరు 14న సమాచారం అందింది. అక్కడికి వెళ్లి న్యాయ అధికారులు పరిశీలించగా మృతదేహం పూర్తిగా కుళ్లిపోయి ఉంది. ఓసియన్ కంట్రీ మెడికల్ ఎగ్జామినర్ కార్యాలయం నిర్వహించిన పోస్టుమార్టంలో అతడి ఛాతీలో బుల్లెట్లు ఉన్నట్టు గుర్తించారు. కాల్పుల కారణంగా ఆ వ్యక్తి మరణించాడని నిర్ధారించారు. మృతుడు భారతీయుడైన కుల్దీప్ కుమార్‌గా గుర్తించారు. కొన్ని రోజులుగా కుల్దీప్ కుమార్ కనిపించపోవడంతో కుటుంబ సభ్యులు 2024 అక్టోబరు 26న ఫిర్యాదు చేయడంతో అప్పట్లో మిస్సింగ్ కేసు నమోదైంది.
అనేక ఏజెన్సీల భాగస్వామ్యంతో…
కుల్దీప్ హత్యపై జరిగిన దర్యాప్తులో అనేక న్యాయ వ్యవస్థ ఏజెన్సీలు భాగస్వాములయ్యాయి. సూత్రధారి సందీప్‌కుమార్ కాగా ఈ హత్యకు సౌరవ్, గౌరవ్, నిర్మల్, గురుదీప్ సహకరించారని నిర్ధారించాయి. సందీప్‌తోపాటు నలుగురిని నిందితులుగా పేర్కొంటూ కేసు నమోదైంది. నలుగురు నిందితులను ఇండియానాలోని జాన్సన్ కౌంటీ జైలుకు తరలించారు. అక్కడి నుండి న్యూజెర్సీకి అప్పగించే ప్రక్రియ కొనసాగుతోంది. అలాగే ప్రధాన సూత్రధారి సందీప్‌ను న్యూజెర్సీ రాష్ట్ర పోలీసు బారాక్ హోల్మ్డెల్ వద్ద అదుపులోకి తీసుకున్నారు. అతనిని Ocean County జైలుకు తరలించారు. ప్రస్తుతం డిటెన్షన్ హియరింగ్ కోసం అదుపులో ఉంచారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..