OYO Rooms New Booking Policy : పెళ్లికాని జంటలు ఇక నుంచి OYOకు వెళ్లడం కుదరదు. పెళ్లి అయ్యిందని బుకాయించి రూమ్ బుక్ చేసుకుందామన్నా వీలు కాదు. మ్యారీడ్ కపుల్‌కు మాత్రమే ఇక నుంచి OYO రూములు బుక్ చేసుకొనే అనుమతి ఉంటుంది. ఈ కొత్త విధానాన్నిOYO సంస్థ అమల్లోకి తెచ్చింది. ప్రస్తుతం యూపీలో ప్రయోగాత్మకంగా చేపట్టిది. త్వరలోనే దేశవ్యాప్తంగా అమలు చేయనుంది.
OYOకు వెళ్తే.. ఆధారాలు ఉండాల్సిందే..
ట్రావెల్ బుకింగ్ దిగ్గజం OYO సంస్థ తమ భాగస్వామ్య హోటళ్ల కోసం కొత్త చెక్-ఇన్ విధానాన్ని ప్రారంభించింది. ఇది మొదటగా ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో అమల్లోకి వచ్చింది. పెళ్లి కాని జంటలు హోటల్‌కు వెళ్తే ఇక నుంచి రూములు ఇవ్వరు. పెళ్లయిన వారు బుక్ చేసుకోవాలంటే అందుకు ఆధారాలు చూపించారు. అప్పుడే అనుమతినిస్తారు. జంటలు చెక్-ఇన్ సమయంలో తమ వైవాహిక సంబంధాన్ని రుజువు చేసే ఆధారాలను సమర్పించాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌లో బుకింగ్ చేసిన వారికి కూడా ఈ నియమాలు వర్తిస్తాయి.
పౌర సంఘాల అభ్యర్థన మేరకు..
ఈ కొత్త మార్గదర్శకాలు తక్షణం అమలు చేయాలని OYO సంస్థ మీరట్‌లోని తన భాగస్వామ్య హోటళ్లకు ఆదేశాలు జారీ చేసింది. ఈ మార్పులపై వచ్చే ఫీడ్‌బ్యాక్ ఆధారంగా ఇతర నగరాలకు కూడా దీనిని విస్తరించొచ్చని తెలుస్తోంది. పెళ్లి కాని జంటలు ఓయో హోటళ్ల (OYO Rooms)ను బుక్ చేసుకొని గడపడం మన సంస్కృతీ సంప్రదాయాలకు విరుద్ధమని, దీనికి చరమగీతం పాడాలని మీరట్‌లోని పౌర సంఘాలు అభ్యంతరాలు తెలపడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
OYO రీజనల్ హెడ్ ఏమంటున్నారంటే..
ఈ కొత్త నిబంధనల ద్వారా కుటుంబాలు, విద్యార్థులు, వ్యాపారులు, పర్యాటకులు, యాత్రికులు, ఒంటరి ప్రయాణికుల కోసం సురక్షితమైన అనుభవాలను అందించే బ్రాండ్‌గా తనను తాను ప్రదర్శించుకోవాలని OYO భావిస్తోంది. ‘OYO సురక్షిత, బాధ్యతాయుత హాస్పిటాలిటీని పాటించడానికి కట్టుబడి ఉంది. వ్యక్తిగత స్వేచ్ఛను గౌరవించడంతోపాటే పౌర సంఘాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవడం మా బాధ్యత’ అని భావిస్తున్నాం అని OYO రీజియన్ హెడ్ పావస్ శర్మ అంటున్నారు. ఈ పాలసీని నిరంతరం సమీక్షించడమే కాకుండా, దాని ప్రభావాన్ని పరిశీలిస్తామని చెబుతున్నారు.
కొత్తగా OYO చేపడుతున్న చర్యలు
- పోలీసులు, హోటల్ భాగస్వామ్యాలతో కలిపి సురక్షిత హాస్పిటాలిటీపై సంయుక్త సెమినార్లను నిర్వహించడం.
- అసహజ కార్యకలాపాలను ప్రోత్సహించే హోటళ్లను నిషేధించడం.
- అనధికారిక హోటళ్లు OYO బ్రాండింగ్‌ను ఉపయోగిస్తే చర్యలు తీసుకోవడం.
- కొత్త పాలసీని యావత్ భారతదేశంలో ప్రయోగాత్మకంగా అమలు చేయడాన్ని పరిశీలించడం.
OYO రూములు ఎలా ఉంటాయంటే..
OYO అనే పేరు On Your Own అనే పదబంధానికి సంక్షిప్తం. ఇది భారతదేశంలో స్థాపించిన అతిపెద్ద హోటల్ అండ్ లివింగ్ స్పేస్ చైన్. 2013లో రితేష్ అగర్వాల్ అనే యువ పారిశ్రామికవేత్త OYO సంస్థను ప్రారంభించారు. మొదట ఇది గృహాలు, చిన్న హోటళ్లకు సాంకేతిక సమస్యల పరిష్కారాలను అందించడమే లక్ష్యంగా ఈ సంస్థ పనిచేసింది.
OYO ప్రపంచవ్యాప్త సేవలు
- హోటల్ బుకింగ్: వ్యాపార, కుటుంబ వ్యక్తిగత ప్రయోజనాల కోసం అన్ని ధరల రేంజ్‌లో హోటల్స్ అందుబాటులో ఉన్నాయి.
- విలాస్ & హోలిడే హోమ్స్: ఫ్యామిలీ ట్రిప్స్ లేదా గ్రూప్ స్టే కోసం ప్రత్యేకమైన వసతులు.
- లాంగ్-స్టే ప్రాపర్టీస్: ఎక్కువ కాలం ఉండే గెస్ట్‌ల కోసం అద్దె గృహాల అందుబాటు.
- OYO ప్యార్టనర్ ప్రోగ్రాం: హోటల్ యజమానులకు వారి స్థలాలను మరింత ప్రాచుర్యం పొందేలా చేయడానికి సాంకేతిక పరిజ్ఞానం అందించడం.
- AC రూమ్స్, ఫ్రీ వైఫై, టీవీ, శుభ్రమైన స్నానాల గదుల వంటి సేవలు అందుబాటులో ఉంటాయి.
- అన్ని రూమ్స్ ముందుగా వెరిఫికేషన్ ప్రక్రియ ద్వారా నాణ్యతా ప్రమాణాలను పాటించేలా చూస్తారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..