Registration Department Corruption | రాష్ట్రంలో భూముల విలువ పెరిగిందో లేదో కానీ, కొంతమంది సబ్ రిజిస్ట్రార్ల జేబుల విలువ మాత్రం కోట్లలో పెరుగుతోంది. సామాన్యుడి సొంతింటి కలను పెట్టుబడిగా మార్చుకుంటూ, అక్రమ సంపాదనకు అలవాటు పడ్డ అధికారులు.. ఏసీబీ ఎన్నిసార్లు హెచ్చరించినా, అరెస్టులు చేసినా తమ పంథా మార్చుకోవడం లేదు.
Corruption : ఏడాది కాలం.. 15 మంది అధికారులు!
గడిచిన 12 నెలల కాలంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఏకంగా 15 మంది సబ్ రిజిస్ట్రార్లు మరికొంత మంది ఉద్యోగులు ఏసీబీ (ACB) వలలో చిక్కడం శాఖా పరంగా పెద్ద సంచలనంగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ఈ దాడుల్లో కోట్లాది రూపాయల నగదు, అక్రమ ఆస్తుల పత్రాలు బయటపడ్డాయి.
”తప్పు చేస్తే శిక్ష తప్పదని ప్రభుత్వం చెప్తున్నా.. ‘మా వెనుక పెద్దలున్నారు’ అనే ధీమాతో కొందరు అధికారులు బరితెగిస్తున్నారు.”
గడిచిన 12 నెలల కాలంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఏసీబీ జరిపిన దాడులు శాఖా పరంగా పెద్ద సంచలనాన్ని సృష్టించాయి. ఈ గణాంకాలు చూస్తే అవినీతి ఎంత లోతుగా ఉందో అర్థమవుతుంది.
| వివరణ | గణాంకాలు |
| కాలపరిమితి | గత 12 నెలలు |
| పట్టుబడ్డ సబ్ రిజిస్ట్రార్లు | 15 మంది |
| ఇతర సిబ్బంది/ప్రైవేట్ వ్యక్తులు | 10 మందికి పైగా |
| స్వాధీనం చేసుకున్నవి | కోట్లాది నగదు, అక్రమ ఆస్తుల పత్రాలు |
డాక్యుమెంట్ రైటర్ లు, ప్రైవేట్ వ్యక్తుల ద్వారానే…
ఏసీబీ నివేదికల ప్రకారం, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అవినీతి ఇలా సాగుతోంది. కార్యాలయంలో ఉండే అధికారుల ప్రైవేట్ వ్యక్తులు, కార్యాలయం వెలుపల ఉండే డాక్యుమెంట్ రైటర్ ల ద్వారానే ఈ దందా (Corruption) కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ప్రజలు నేరుగా కాకుండా డాక్యుమెంట్ రైటర్ ల ద్వారా రిజిస్ట్రేషన్ కు వెళ్లడం వల్ల అధికారుల అక్రమార్జన సులువుగా జరుగుతుందని ఏసీబీ అధికారులు పలు సందర్భాల్లో తెలిపారు.
మార్పు ఎందుకు రావడం లేదు?
ఏసీబీ అధికారులు పట్టుకున్నా, కోర్టులో విచారణ ఏళ్ల తరబడి సాగడం అధికారుల్లో భయం పోగొడుతోంది. కొంతమంది అధికారులకు స్థానిక ప్రజాప్రతినిధుల మద్దతు ఉండటం వల్ల వారు యథేచ్ఛగా దందాలు సాగిస్తున్నారు.కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు వాటాల పంపిణీ జరగడం వల్ల వ్యవస్థలో లోపం పేరుకుపోయింది.
సామాన్యుడికి శాపం
ప్రభుత్వం రిజిస్ట్రేషన్ల ప్రక్రియను ఆన్లైన్ చేసి, పారదర్శకత పెంచిన్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో మాత్రం ‘మామూళ్ల’ పర్వం కొనసాగుతూనే ఉంది. ఏడాది కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా 15 మంది పట్టుబడటం అనేది కేవలం మంచుకొండ కొన మాత్రమే. వ్యవస్థలో సమూల మార్పు వస్తే తప్ప, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు అవినీతి రొంపి నుంచి బయటపడలేవని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఏసీబీ దాడులతో రాష్ట్రవ్యాప్తంగా ప్రకంపనలు రేగుతున్నా, కొందరు అధికారులు మాత్రం తీరు మార్చుకోవడం లేదు. మరికొంతమంది రిజిస్ట్రార్ లు,సబ్ రిజిస్ట్రార్ల అక్రమ సంపాదన, అవినీతి సామ్రాజ్యంపై ‘సర్కార్ లైవ్’ వరుస ప్రత్యేక కథనాలను అందించనుంది.








