Warangal News | విద్యాసంస్థల్లో ఎవరైనా విద్యార్థులు ర్యాగింగ్ (Ragging) వంటి వికృత చేష్టలకు పాల్పడే వారిపై చట్ట ప్రకారం క్రిమినల్ చర్యలు తీసుకుంటామని వరంగల్ పోలీస్ కమిషనర్ (Warangal CP) సన్‌ప్రీత్ సింగ్ హెచ్చరించారు. త్వరలో నూతన విద్యా సంవత్సరం ప్రారంభం కాబోవుతున్న నేపథ్యంలో వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ర్యాగింగ్ నియంత్రణపై వరంగల్ పోలీస్ కమిషనర్ ఆదివారం కీలక ప్రకటన చేశారు. విద్యా సంస్థల్లో ర్యాగింగ్‌కు పాల్పడడమనేది తీవ్రమైన నేరంగా పరిగణించబడుతుందని, ఈ చర్యల ద్వారా విద్యార్థుల భవిష్యత్తును ప్రమాదంలో పడేలా ఉంటుందని అన్నారు. ముఖ్యంగా సీనియర్ల ముసుగులో జూనియర్ విద్యార్థుల పట్ల అసాంఘిక కృత్యాలకు పాల్పడేవారిపై కఠినంగా వ్యవహరిస్తూ విద్యాసంస్థల నుంచి తొలగించడంతో పాటు ర్యాగింగ్ లాంటి చర్యలకు పాల్పడే విద్యార్థులపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ర్యాగింగ్ పాల్పడిన విద్యార్థుల విద్యా, ఉద్యోగ, భవిష్యత్తు అవకాశాలపై తీవ్ర ప్రభావం పడుతుందని పోలీస్ కమిషనర్ చెప్పారు.
Ragging : యాజమాన్యాలు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి
విద్యా సంస్థల్లో ర్యాగింగ్ నియంత్రణ కోసం యాజమాన్యం ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని వరంగల్ సీపీ తెలిపారు. ఇందులో భాగంగా ప్రతి ఉన్నత విద్యా సంస్థల్లో యాంటీ ర్యాగింగ్ కమిటీలు స్వ్కాడ్‌లను ఏర్పాటు చేయాలన్నారు. కొత్తగా వచ్చిన విద్యార్థుల కోసం ప్రత్యేక పర్యవేక్షణ ఉండాలని ముఖ్యంగా ర్యాగింగ్ వ్యతిరేక అవగాహన కార్యక్రమాలతో పాటు సెమినార్లు, వర్క్‌షాపులు నిరంతరం నిర్వహించాలని సూచించారు. విద్యార్థులు ఫిర్యాదు చేసేందుకు 24గంటల హెల్ప్‌లైన్ నంబర్లను విద్యాసంస్థల యాజమాన్యం అందుబాటులో ఉంచాలని సూచించారు.
విద్యార్థులు సహ విద్యార్థులపై ఎటువంటి వేధింపులు, దౌర్జన్యాలు, అసభ్య కార్యకలాపాలకు పాల్పడవద్దని ఎవరైన ర్యాగింగ్‌కు గురైతే తక్షణమే ప్రిన్సిపాల్, యాజమాన్యం లేదా పోలీసులకు సమచారం అందించాలన్నారు. ర్యాగింగ్‌కు పాల్పడం ద్వారా విద్యా భవిష్యత్తు నాశనం అవుతుందని ప్రతి ఒక్క విద్యార్థి గుర్తుంచుకోవాలని పోలీస్ కమిషనర్ సూచిస్తూ ర్యాగింగ్ అనేది విద్యార్థుల భవిష్యత్తును మాత్రమే కాకుండా సమాజంపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతుందని కావున విద్యా సంస్థల యాజమాన్యం, అధ్యాపకులు, విధ్యార్థులు పోలీసులు కలిసి పనిచేసిప్పుడే ర్యాగింగ్ సంస్కృతిని పూర్తిగా నిర్మూలించగలుతామని పోలీస్ కమిషనర్ తెలియజేసారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.