Bird flu cases in Telangana | భారతదేశంలో బర్డ్‌ఫ్లూ (Avian Influenza) కేసులు వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్రంలో ఇది వ్యాపించకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా పశు సంవర్థక శాఖ (Veterinary and Animal Husbandry) ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. రాష్ట్రంలోని కోళ్ల పెంపకందారులు, పౌల్ట్రీ పరిశ్రమ ప్రతినిధులతో సమావేశమై బర్డ్‌ఫ్లూ వ్యాప్తి, తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తోంది. ప్రజలకు కూడా రాష్ట్ర ప్రభుత్వం పలు సూచనలు చేస్తోంది. బర్డ్‌ఫ్లూ ప్రస్తుతం ప్రమాదకరమేమీ కాదని, ఎలాంటి భయాందోళనకు గురికాకుండా ముందస్తు జాగ్రత్తలు పాటించాలని అంటోంది.
Bird flu : పౌల్ట్రీ ఉత్పత్తుల దిగుమతులపై నిషేధం
బర్డ్‌ఫ్లూ (Bird flu) వ్యాపిస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలోకి కోళ్లు, గుడ్లు, పౌల్ట్రీ ఫీడ్ (కోళ్ల దానా) దిగుమతులను పశుసంవర్థక శాఖ నిషేధించింది. అవి ఇతర రాష్ట్రాల నుంచి రావడం ద్వారా వైరస్ వ్యాపించే అవకాశం ఉందని ఈ చర్య తీసుకుంది.
రాష్ట్ర సరిహద్దుల్లో తనిఖీలు
రాష్ట్ర సరిహద్దుల్లోని చెక్‌పోస్టుల వద్ద 24/7 గంటల పాటు సిబ్బందిని నియమించి పటిష్ట తనిఖీలు చేపడుతున్నారు. పౌల్డ్రీ ఉత్పత్తులను అక్రమంగా రవాణా చేసేందుకు ప్రయత్నిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరిస్తున్నారు.
పౌల్ట్రీ ఫార్మ్‌ల పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి
కేవలం కోళ్ల ఉత్పత్తుల రవాణా పైనే కాకుండా పౌల్ట్రీ ఫార్మ్‌ల (poultry farms) పరిశుభ్రతపై కూడా ప్రత్యేక దృష్టి సారించారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాలలోని పౌల్ట్రీ ఫార్మ్‌లను ఇప్పటికే అధికారుల బృందం సందర్శించి రైతులకు మార్గదర్శకం చేసింది. వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి ఫార్మ్‌లు శుభ్రంగా ఉంచాలని, కోళ్లకు రక్షణ చర్యలు తీసుకోవాలని, కోళ్లకు శుభ్రమైన నీటిని అందించాలని తదితర ముఖ్యమైన సూచనలు అందిస్తోంది.
చికెన్‌ను బాగా ఉడకబెట్టాలి..
కోడి మాంసం (Chicken), గుడ్ల (Eggs)ను సురక్షితంగా వండుకుని తినాలని పశుసంవర్థక శాఖ సూచిస్తోంది. పౌల్ట్రీ పరిశ్రమపై ప్రజల్లో అవగాహన లేకపోవడం వల్ల అపోహలు విస్తరిస్తున్నాయని, చికెన్‌ను, గుడ్లను బాగా ఉడకబెట్టి తింటే ఎలాంటి ప్రమాదం ఉండదని అధికారులు అంటున్నారు.
బర్డ్‌ఫ్లూ అంటే ఏమిటి?
బర్ఢ్‌ఫ్లూ (Bird flu Avian Influenza) అనేది Influenza A Virus వల్ల వచ్చే వ్యాధి. ఇది ప్రధానంగా పక్షుల్లోనే వ్యాపిస్తుంది. కానీ కొన్ని సందర్భాల్లో మానవులను కూడా ప్రభావితం చేసే ప్రమాదం ఉంది. ఈ వైరస్ ఇన్ఫెక్టెడ్ పక్షుల మ్యూకస్ (శ్లేష్మం), లాలాజలం, మలం ద్వారా వ్యాపిస్తుంది. ముఖ్యంగా ఇది వలస పక్షుల ద్వారా ప్రపంచ వ్యాప్తంగా వ్యాపించే అవకాశం ఉంది.
Types of Bird flu : బర్డ్‌ఫ్లూ ఎన్ని రకాలు?
-సాధారణంగా ఉండే బర్డ్‌ఫ్లూ (Low Pathogenic Avian Influenza – LPAI) ఇందులో ఒకటి. దీని ప్రభావం తక్కువగా ఉంటుంది. కోళ్లలో తేలికపాటి జ్వరంగా మాత్రమే కనిపిస్తుంది.
- అతిగా వ్యాపించే బర్డ్‌ఫ్లూ (High Pathogenic Avian Influenza – HPAI) అనేది రెండో రకం. ఇది చాలా తీవ్రంగా ఉండి, కోళ్లను భారీగా చంపేస్తుంది. మానవులకు కూడా ఇది ప్రమాదకరం.
- అలాగే H5N1 అనేది అత్యంత ప్రమాదకరమైన వైరస్ స్ట్రెయిన్. ఇది ఒక్కసారి వ్యాపిస్తే పౌల్ట్రీ పరిశ్రమకు భారీ నష్టం కలుగుతుంది.
- ఈ వైరస్ మనుషులపై చాలా అరుదుగా ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. కానీ ఒకసారి ఇదిఇ సోకినట్లయితే దీని లక్షణాలు సాధారణ ఫ్లూ కంటే తీవ్రంగా ఉంటాయని అంటున్నారు.
బర్డ్‌ఫ్లూ లక్షణాలు
బర్డ్‌ఫ్లూ ఉన్న వారికి జ్వరం ఉంటుంది. తలనొప్పి, ఒళ్లు నొప్పులు, తీవ్రమైన దగ్గు, మలబద్ధకం లేదా విరేచనాలు, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది లాంటి ప్రధాన లక్షణాలు కనిపిస్తాయి. ఇవి తీవ్రమైతే వెంటనే వైద్యులను సంప్రదించాలని నిపుణులు సూచిస్తున్నారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..








2 Comments
[…] ఉభయ గోదావరి జిల్లాల్లో బర్డ్‌ఫ్లూ (Bird Flu) కలకలం సృష్టిస్తోంది. రెండు […]
[…] (BirdFlu) భయాలు ఇంకెంత కాలం […]