- విధులు నిర్వహించిన ప్రతి మండలంలోనూ ‘విజయ’మే..
- బినామీల పేరిట కోట్ల సామ్రాజ్యం.. తవ్వేకొద్దీ దిమ్మతిరిగే ఆస్తులు!
Surveyor Scam in Hanumakonda | ఆయనో సాదాసీదా ప్రభుత్వ సర్వేయర్. భూముల సరిహద్దులు కొలవడమే ఆయన విధి. కానీ, చేతిలో ఉన్న సర్వే గొలుసుతో తన సొంత ఆస్తుల సరిహద్దులను మాత్రం ఎవ్వరికీ అందనంత ఎత్తుకు పెంచేసుకున్నారు. విధులు నిర్వహించిన ప్రతి మండలంలోనూ సారుకు ‘విజయ’మే లభించిందని, బినామీల పేర్లతో కోట్లాది రూపాయల ఆస్తులు కూడబెట్టారనే గుసగుసలు ఇప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లా రెవెన్యూ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.
నర్సింహులపేట టూ హన్మకొండ.. ‘కనకవర్షం’!
నర్సింహులపేట మండలంలో ఒక సాధారణ ఉద్యోగిగా ప్రారంభమైన ఆయన ప్రస్థానం, అనతికాలంలోనే కోట్లాది రూపాయల ఆస్తులను సంపాదించే స్థాయికి చేరుకోవడంపై స్థానికంగా పెద్ద చర్చ నడుస్తోంది. ప్రస్తుతం హన్మకొండ జిల్లాలోని ఓ మండలంలో విధులు నిర్వహిస్తున్న ఈ సర్వేయర్ లీలలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి.
ఇటీవల తన సొంత గ్రామంలోనే నాలుగు ఎకరాల వ్యవసాయ భూమిని కొనుగోలు చేసినట్లు సమాచారం.
గతంలో తొర్రూరు టీచర్స్ కాలనీలో ఒక ఇంటిని కొనుగోలు చేసి, కొద్ది రోజుల క్రితమే దానిని సుమారు రూ.1 కోట్లకు విక్రయించినట్లు తెలిసింది.ఇవే కాకుండా హైదరాబాద్, మహబూబాబాద్, తొర్రూర్, నర్సంపేట తదితర ప్రాంతాల్లో బినామీల పేర్లతో భారీగా ప్లాట్లు కూడబెట్టినట్లు ఆయన మాతృశాఖలోని తోటి అధికారులే బాహాటంగా చెప్పుకుంటున్నారు.
నాడు ‘ఎమ్మెల్యే’ అండ.. సెటిల్‌మెంట్లకు కేరాఫ్ అడ్రస్!
గతంలో మహబూబాబాద్ జిల్లాలో సదరు సర్వేయర్ పని చేసిన కాలంలో.. అప్పటి అధికార పార్టీకి చెందిన ఓ కీలక ఎమ్మెల్యేకు అన్నీ తానై వ్యవహరించినట్లు ప్రచారం జరుగుతోంది.
సదరు ప్రజాప్రతినిధి రాజకీయ ఆశీస్సులతోనే వివాదాస్పద భూములను క్లియర్ చేయడం, తెరవెనుక సెటిల్మెంట్లు చేయడంలో ఈయన కీలక పాత్ర పోషించారనే ఆరోపణలు ఉన్నాయి. బలమైన పొలిటికల్ బ్యాగ్రౌండ్ ఉండటంతో అప్పట్లో ఈయన వైపు కన్నెత్తి చూసే ధైర్యం కూడా ఎవరూ చేయలేకపోయారని స్థానికులు చెప్పుకుంటున్నారు.
విచారణ జరిపితేనే అసలు రంగు బయటపడేనా..?
ఒక సాధారణ ప్రభుత్వ ఉద్యోగికి తన సర్వీస్ ఆదాయానికి మించి ఇన్ని కోట్లాది రూపాయల ఆస్తులు ఎలా సమకూరాయనే అంశంపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సదరు అధికారి పేరుతో పాటు, ఆయన కుటుంబ సభ్యులు, బినామీల పేర్లపై ఉన్న అక్రమ ఆస్తుల వివరాలపై సమగ్ర విచారణ జరిపితే మరిన్ని నమ్మలేని నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశముందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.








