•ఏసీబీ వలలో R&B ఈఎన్సీ మోహన్ నాయక్: 11 చోట్ల ఏకకాలంలో సోదాలు!
•ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తెలంగాణ ఏసీబీ మెరుపు దాడులు
•ఇప్పటివరకు రూ.60 లక్షల నగదు, 10 తులాల గోల్డ్ బిస్కెట్లు లభ్యం
•ఈఎన్సీగా బాధ్యతలు చేపట్టిన ఏడాదిలోపే అవినీతి తిమింగలం గుట్టురట్టు
తెలంగాణ రోడ్లు, భవనాల శాఖ (R&B) ఇంజినీర్-ఇన్-చీఫ్ (ఈఎన్సీ) మోహన్ నాయక్ అవినీతి సామ్రాజ్యంపై అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు విరుచుకుపడ్డారు. ఆయన ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారనే పక్కా సమాచారంతో మంగళవారం ఉదయం నుంచే ఏసీబీ అధికారులు భారీ సోదాలు చేపట్టారు.
హైదరాబాద్‌లోని మోహన్ నాయక్ నివాసంతో పాటు ఆయనకు అత్యంత ఆప్తులు, బంధువులకు చెందిన మొత్తం 11 ప్రాంతాలలో 16 ప్రత్యేక బృందాలు ఏకకాలంలో తనిఖీలు నిర్వహిస్తున్నాయి.
కట్టల కొద్దీ నోట్లు.. లీటర్ల కొద్దీ మద్యం!
ఈ సోదాలకు సంబంధించిన వివరాలను ఏసీబీ జాయింట్ డైరెక్టర్ ప్రవీణ్ కుమార్ మీడియాకు వెల్లడించారు. ఉదయం నుంచి జరిగిన ప్రాథమిక తనిఖీల్లోనే భారీగా అక్రమ ఆస్తులు వెలుగు చూశాయని ఆయన తెలిపారు. ఇప్పటివరకు జరిపిన సోదాల్లో రూ. 60లక్షల నగదు,10 తులాల బంగారు బిస్కెట్లు,35 ఖరీదయిన విదేశీ మద్యం బాటిల్ లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ఇంకా పలు కీలక పత్రాలు, బ్యాంకు లాకర్ల వివరాలు, బినామీ ఆస్తులకు సంబంధించిన డైరీలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. సాయంత్రం లోపు మరిన్ని సంచలన నిజాలు, అక్రమ ఆస్తుల వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉందని జేడీ ప్రవీణ్ కుమార్ స్పష్టం చేశారు.
గతంలో స్టేట్ రోడ్స్ చీఫ్ ఇంజినీర్‌గా, రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (RDC) ఎండీగా పనిచేసిన మోహన్ నాయక్, సెప్టెంబర్ 2025లో ఈఎన్సీగా పదోన్నతి పొందారు.
ఏడాది తిరక్కుండానే అడ్డంగా బుక్కయ్యారు..
ప్రభుత్వంలో అత్యంత కీలకమైన ఆర్‌అండ్‌బీ శాఖకు బాస్ (ఈఎన్సీ)గా బాధ్యతలు స్వీకరించి కనీసం ఏడాది కూడా కాకముందే.. మోహన్ నాయక్ ఈ స్థాయిలో అవినీతి ఆరోపణల్లో చిక్కుకోవడం సచివాలయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. భారీ ఎత్తున సాగుతున్న ఈ సోదాల అనంతరం ఏసీబీ అధికారులు ఆయనపై తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకోనున్నారు.








