•రెవెన్యూ, సర్వే అండ్ ల్యాండ్స్ రికార్డ్స్ శాఖల్లో జోరుగా చర్చ
•ఏసీబీ నజర్ వేస్తే R&B “మోహన్ నాయక్” లాగే మరో అవినీతి తిమింగళం చిక్కినట్లే అంటూ ప్రచారం..
•బినామీల పేర్లతో అక్రమంగా ఆస్తులు కూడబెట్టినట్లు ఆరోపణలు
•నర్సింహులపేట టు హన్మకొండ జిల్లా.. వయా తొర్రూర్, మహబూబాబాద్, మరిపెడ బంగ్లా…
•2009 లో పోస్టింగ్.. 2026 వరకే కోట్లు కొల్లాగొట్టినట్లు ప్రచారం
మహబూబాబాద్/హన్మకొండ, జూన్ 11: సర్వే అండ్ ల్యాండ్స్ రికార్డ్స్ శాఖకు చెందిన ఓ సర్వేయర్ అక్రమాస్తుల వ్యవహారం ప్రస్తుతం రెవెన్యూ, సర్వే అండ్ ల్యాండ్స్ రికార్డ్స్ శాఖల్లో హాట్‌టాపిక్‌గా మారింది. సదరు అధికారి విధులు నిర్వహించిన ప్రాంతాల్లో బినామీల పేర్లతో “విజయ”వంతంగా భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) దృష్టి సారిస్తే మరో కీలక ఆదాయానికి మించిన ఆస్తుల కేసు వెలుగులోకి వచ్చే అవకాశముందని ఉద్యోగ వర్గాల్లో చర్చ సాగుతోంది.
శాఖ వర్గాల సమాచారం ప్రకారం 2009లో ప్రభుత్వ సేవలో చేరిన సర్వేయర్ నర్సింహులపేట, తొర్రూర్, మహబూబాబాద్, మరిపెడ తదితర ప్రాంతాల్లో విధులు నిర్వహించారు. ఈ క్రమంలో హైదరాబాద్, మహబూబాబాద్, తొర్రూర్, నర్సంపేట, మాటేడు, ఎర్రబెల్లిగూడెం ప్రాంతాల్లో బినామీల పేర్లతో స్థలాలు, వ్యవసాయ భూములు, ఇతర స్థిరాస్తులు సమకూర్చుకున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ ఆస్తుల విలువ కోట్ల రూపాయల్లో ఉంటుందని స్థానికంగా చర్చించుకుంటున్నారు.మాతృశాఖలో వినిపిస్తున్న ఆరోపణల ప్రకారం తొర్రూర్ టీచర్స్ కాలనీలో సుమారు 240 గజాల స్థలంలో నివాస గృహాన్ని నిర్మించి, అనంతరం అధిక ధరకు విక్రయించినట్లు సమాచారం. అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో పలువురితో కలిసి పెట్టుబడులు పెట్టి, స్లీపింగ్ పార్ట్నర్గా వ్యవహరించినట్లు కూడా ప్రచారం జరుగుతోంది.
కేవలం ప్రభుత్వ ఉద్యోగం ద్వారా ఇంత పెద్ద మొత్తంలో ఆస్తులు సమకూర్చుకోవడం సాధ్యమేనా అనే ప్రశ్నలు శాఖలోనే వ్యక్తమవుతున్నాయి. సదరు సర్వేయర్ ఆస్తుల మూలాలపై సమగ్ర విచారణ జరిపితే వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశముందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
ఇటీవల ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో చిక్కుకున్న “ఆర్&బీ మాజీ ఈఎన్సీ మోహన్ నాయక్ “వ్యవహారం తరహాలోనే ఈ సర్వేయర్ పైనా విచారణ జరగాలని ఉద్యోగ వర్గాలు కోరుతున్నాయి. అయితే ప్రస్తుతం వినిపిస్తున్నవి ఆరోపణలు, ప్రచారం మాత్రమేనని, సంబంధిత దర్యాప్తు సంస్థలు విచారణ చేపట్టిన తర్వాతే వాస్తవ పరిస్థితులు స్పష్టమవుతాయని “సర్కార్ లైవ్”స్పష్టం చేస్తోంది.
విచారణ జరిగితేనే వాస్తవాలు వెలుగులోకి…
సదరు సర్వేయర్‌పై వినిపిస్తున్న ఆరోపణలపై ఏసీబీ లేదా ఇతర దర్యాప్తు సంస్థలు దృష్టి సారించి విచారణ చేపడితే ఆస్తుల వివరాలు, వాటి మూలాలు, బినామీ లావాదేవీల అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశముందని శాఖ వర్గాలు భావిస్తున్నాయి. ప్రస్తుతం ఈ వ్యవహారం ఉమ్మడి వరంగల్ జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.
రామాయణం లో మంత్రి “భాస్కరుడు” రచించిన “భాస్కర” రామాయణం ఎంత ఫేమస్ అయిందో,సర్వే అండ్ ల్యాండ్స్ రికార్డ్స్ లో సదరు సర్వేయర్ బినామీ పేర్లతో కూడబెట్టిన అక్రమాస్తుల జాబితా కూడా అంతే ఫేమసట…








