Telangana education sector : రాష్ట్ర విద్యా రంగంలో విశేష మార్పులు చోటుచేసుకుంటున్నాయి. విద్యావనరులు, ప్రమాణాలు మెరుగుపడ్డాయని తెలంగాణ ప్రభుత్వం (Telangana government) తాజాగా విడుదల చేసిన సామాజిక, ఆర్థిక అవలోకనం -2025 (Socio-Economic Outlook) నివేదిక చెబుతోంది. 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఈ రిపోర్టు ద్వారా ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేట్ పాఠశాలలు, కొత్తగా ఏర్పాటవుతున్న విద్యా సంస్థలు, విద్యార్థులకు లభిస్తున్న అవకాశాలు వంటి అంశాలు సమగ్రంగా వెల్లడయ్యాయి. తెలంగాణ విద్యా రంగం (Telangana education sector) మరింత బలపడిందని నివేదిక చెబుతోంది.
ప్రభుత్వ విద్యావ్యవస్థ బలోపేతానికి కృషి
రాష్ట్ర వ్యాప్తంగా 1.94 కోట్ల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నారని ఈ నివేదిక చెబుతోంది. ప్రైవేట్ పాఠశాలల్లో 3.635 కోట్ల మంది ఉన్నారని తెలిపింది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గిపోతుండటాన్ని దృష్టిలో ఉంచుకుని, ప్రభుత్వ విద్యా వ్యవస్థ (education sector)ను బలోపేతం చేయడం లక్ష్యంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ప్రారంభించనున్నారు. ఈ పాఠశాలల ద్వారా ప్రభుత్వ విద్యా సంస్థల్లో విద్యార్థుల చేరికను పెంచడంతో పాటు నాణ్యమైన విద్య అందించేందుకు కృషి జరుగుతోంది. ముఖ్యంగా వెనుకబడిన వర్గాలకు విద్యను అందుబాటులోకి తీసుకురావడం లక్ష్యంగా ప్రభుత్వం ఈ పాఠశాలలను ప్రాధాన్యమినిస్తూ రూపొందించింది.
Telangana education sector : అందరికీ సమాన విద్య
ఈ విద్యా సంవత్సరాని (2025-26)కి రాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగానికి భారీగా రూ. 11,600 కోట్లు కేటాయించింది. ఈ నిధుల ద్వారా అన్ని వర్గాల విద్యార్థులకు సమాన అవకాశాలు కల్పించి, విద్యా రంగ అభివృద్ధికి నూతన కార్యక్రమాలను ప్రవేశపెట్టనున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల విద్యార్థులు సమానంగా అభివృద్ధి చెందేలా ఈ కార్యక్రమాలను అమలు చేయనుంది. తెలంగాణలో మధ్యాహ్న భోజన పథకాన్ని విజయవంతంగా అమలు చేస్తూ సిద్ధిపేట జిల్లా 81 శాతం హాజరుతో మొదటి స్థానాన్ని సాధించింది. ఖమ్మం, జనగామ జిల్లాలు రెండో, మూడో స్థానాల్లో ఉన్నాయి. ఈ పథకం ద్వారా విద్యార్థులకు పోషకాహారాన్ని అందించడమే కాకుండా, వారి హాజరును కూడా పెంచేలా చర్యలు తీసుకుంటున్నారు.
సింగపూర్ ఇన్‌స్టిట్యూట్‌తో ఒప్పందం
రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా రెండు పాలిటెక్నిక్ కళాశాలలను కేసముద్రం (మహబూబాబాద్ జిల్లా), పటాన్‌చెరు (సంగారెడ్డి జిల్లా)లో ఏర్పాటు చేయనుంది. విద్యా ప్రమాణాలను మెరుగుపరిచేందుకు ఖోస్గి ఇంజినీరింగ్ కళాశాలకు 57 బోధనా, బోధనేతర పోస్టులను మంజూరు చేసింది. విద్యార్థుల నైపుణ్యాలను మెరుగుపరిచేందుకు తెలంగాణ ప్రభుత్వం సింగపూర్‌కు చెందిన ప్రఖ్యాత ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (Institute of Technical Education (ITE) తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ భాగస్వామ్యం ద్వారా యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో ప్రపంచ స్థాయి నైపుణ్య శిక్షణ అందించేందుకు వీలు కలుగుతుంది.
విద్యా ప్రమాణాలు పెంచే లక్ష్యం
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం భారీగా ఉపాధ్యాయ నియామకాలను చేపట్టనుంది. డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ (DSC) ద్వారా 11,062 టీచర్లను నియమించి, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను మరింత పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. 2024-25 విద్యా సంవత్సరానికి ప్రభుత్వం మొత్తం రూ. 21,292 కోట్లు కేటాయించింది. గత ఏడాది రూ. 19,093 కోట్లు కేటాయించగా, ఈ ఏడాది దాదాపు 11.5 శాతం పెరుగుదల కనిపిస్తోంది. ఈ మొత్తం బడ్జెట్‌లో రూ. 3,350 కోట్లు ఉన్నత విద్య కోసం, రూ. 17,942 కోట్లు పాఠశాల విద్య కోసం వినియోగించనున్నారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..







