Dharmendra | బాలీవుడ్ లెజెండరీ నటుడు, భారతీయ సినీ పరిశ్రమలో చెరగని ముద్రవేసిన ధర్మేంద్ర సోమవారం ముంబైలోని తన నివాసంలో 89 ఏళ్ల వయస్సులో కన్నుమూశారు. చిత్ర నిర్మాత కరణ్ జోహార్ భావోద్వేగంతో చేసిన సోషల్ మీడియా పోస్టు ద్వారా ఆయన మరణం ధృవీకరించారు. అయితే కుటుంబం నుంచి అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది. డిసెంబర్ 8న ఆయన 90వ పుట్టినరోజు జరుపుకునే ముందు ఈ విషాదం చోటుచేసుకుంది.
కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ధర్మేంద్రను నవంబర్ 10న బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో చేరారు. ఆయన ఆరోగ్యం క్షీణించడంతో సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్, ఆమిర్ ఖాన్, గోవింద వంటి పలువురు ప్రముఖులు ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. రెండు రోజుల తర్వాత, కుటుంబ సభ్యులు ఇంటి నుంచే చికిత్స చేయాలని కోరుకోవడంతో ధర్మేంద్రను నవంబర్ 12న డిశ్చార్జ్ చేశారు. అయితే ఆయన ఆరోగ్యం విషమించడంతో చివరకు తుదిశ్వాస విడిచారు.
ప్రముఖ నటుడు ధర్మేంద్రకు మొదటి భార్య ప్రకాష్ కౌర్, రెండో భార్య హేమ మాలిని, కుమారులు సన్నీ డియోల్, బాబీ డియోల్, కుమార్తెలు విజేత, అజీత్, ఈషా డియోల్ మరియు అహానా డియోల్ తదితరులు ఉన్నారు. భారతీయ సినీ రంగంలో ‘హీ-మ్యాన్’గా ఖ్యాతి పొందిన ధర్మేంద్ర షోలే, ధరమ్‌వీర్, చుప్కే చుప్కే, జుగ్ను, సీతా ఔర్ గీతా వంటి ఎన్నో క్లాసిక్ చిత్రాలతో ప్రేక్షకులను అలరించారు.
ధర్మేంద్ర మరణంతో బాలీవుడ్ చిత్రసీమ మొత్తం శోకసంద్రంలో మునిగిపోయింది. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు ఆయన మృతికి సంతాపం తెలుపుతున్నారు. ధర్మేంద్రను కడసారి చూసేందుకు పలువురు సినీ తారలు, ప్రముఖులు ఆయన నివాసానికి తరలివెళ్లారు.
1958లో దిల్ బీ తేరా హమ్ బీ తేరే చిత్రంతో సినిమారంగంలోకి ప్రవేశించిన ధర్మేంద్ర, తన కెరీర్‌లో “షోలే”, “చుప్కే చుప్కే”, “ధర్మ్ వీర్”, “సీటా ఔర్ గీత”, “యాదోం కి బారాత్” వంటి ఎన్నో క్లాసిక్ సినిమాలు అభిమానుల మదిలో ఇప్పటికీ చెరగని ముద్ర వేశాయి. స్క్రీన్‌పై తన పవర్‌ఫుల్ డైలాగ్ డెలివరీ, మాస్ అప్పీల్, అద్భుతమైన స్టైల్‌తో ఆయనకు అభిమానులు ధర్మేంద్రను “హీ-మ్యాన్ ఆఫ్ బాలీవుడ్” అని పిలుచుకుంటారు.







