BC Reservations : తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలపై మళ్లీ చర్చ వేడెక్కింది. ముఖ్యంగా బీసీ రిజర్వేషన్ల అంశం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఈసారి ఓ కీలక నిర్ణయం తీసుకోబోతోందని తెలుస్తోంది. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం.. బీసీలకు 42% రిజర్వేషన్లు (42% Reservation) కేటాయించి, ఆ రిజర్వేషన్లను పార్టీ పరంగానే అమలు చేస్తూ స్థానిక ఎన్నికలకు వెళ్లే ఆలోచన జరుగుతోంది.
ఈ ప్రతిపాదనపై ఇప్పటికే కాంగ్రెస్ హైకమాండ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. కేంద్ర నాయకత్వం నుంచి కూడా ఇది సాధ్యమేనన్న సంకేతాలు వచ్చాయి. అయితే మరో వైపు బీసీ సంఘాలు మాత్రం దీన్ని పాక్షిక నిర్ణయంగానే చూస్తున్నాయి. తాము కోరుకున్నది పార్టీ ప్రాతిపదికపై కాదని, చట్టపరమైన రిజర్వేషన్లు అమలు చేయాలని అంటున్నాయి.
చట్టపరమైన రిజర్వేషన్లు కావాలంటున్న సంఘాలు
రిజర్వేషన్లను చట్టపరంగా అమలు చేయాలని బీసీ సంఘాలు స్పష్టంగా చెబుతున్నాయి. అలా చేయకుండా ఎన్నికలు (Telangana Elections) నిర్వహించడాన్ని అంగీకరించేది లేని అంటున్నాయి. ప్రభుత్వమే అధికారికంగా రిజర్వేషన్లు నిర్ధారించి, వాటిని చట్టంలో నమోదు చేసి, న్యాయపరమైన ప్రక్రియ పూర్తి చేసిన తర్వాతే ఎన్నికలు జరగాలనే బీసీ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. పార్టీలు తమ ఇష్టం వచ్చినట్లుగా టికెట్లు ఇచ్చినా, దానికి చట్టపరమైన విలువ ఉండదని అంటున్నాయి. ఎన్నికల తర్వాత ప్రభుత్వం మారితే ఆ నిర్ణయాలు తిరస్కరించబడే అవకాశం కూడా ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. బీసీలకు చట్టపరమైన రక్షణ (Legal Reservations)తో రిజర్వేషన్ అవసరమని గట్టి వాదిస్తున్నాయి.
హైకోర్టు స్టేతో పరిస్థితి క్లిష్టం
బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు ఇప్పటికే స్టే (High Court Stay) ఇచ్చింది. దీంతో ప్రభుత్వం ఏ నిర్ణయమూ ముందుకు తీసుకెళ్లలేని పరిస్థితి ఉంది. స్టే ఎత్తివేయని పరిస్థితిలో చట్టపరంగా రిజర్వేషన్ల అమలు కష్టమేనని భావిస్తోంది. మరోవైపు రిజర్వేషన్ బిల్లులు కూడా పెండింగ్‌లోనే ఉన్నాయి. ఇవి ఆమోదం పొందడానికి సమయం పడుతుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో జాప్యం చేయొద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం అయోమయంలో పడింది. ఈ నేపథ్యంలో పార్టీ పరమైన రిజర్వేషన్ల (Party-based Reservations)తో ముందుకు సాగాలని అనుకుంటోంది.
పార్టీ రిజర్వేషన్లు అంటే ఏమిటి?
చట్టపరమైన రిజర్వేషన్లు అంటే… స్థానిక సంస్థలలో (గ్రామ పంచాయతీలు, మండలాలు, జడ్పీలు) ప్రత్యేకంగా BC-A, BC-B, BC-C, BC-D, BC-E వర్గాలకు చట్టం ద్వారా కేటాయించే స్థానాలు. అలాగే పార్టీ ప్రాతిపదికన రిజర్వేషన్లు అంటే.. చట్టం లేకపోయినా, పార్టీ తన అభ్యర్థుల ఎంపికలో బీసీలకు 42% టికెట్లు కేటాయిస్తామని ప్రకటించడం. అంటే, ఇది న్యాయపరమైన రిజర్వేషన్ కాదు. పార్టీ తీసుకునే రాజకీయ నిర్ణయం మాత్రమే.
ఈ నిర్ణయం ఎందుకు కీలకం?
తెలంగాణలో బీసీ ఓటర్ల శాతం భారీగా ఉంటుంది. గత ఎన్నికల్లో బీసీ సంఘాలు పలుసార్లు రిజర్వేషన్ల కోసం పోరాడాయి. అలాంటప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ వర్గాలకు తన మద్దతు చూపించేందుకు ఇది ఒక అవకాశంగా చూస్తోంది. అదే సమయంలో, హైకోర్టు స్టే, రిజర్వేషన్ బిల్లులు పెండింగ్‌లో ఉండటంతో ప్రభుత్వం చేయగలిగిన పరిష్కారం కూడా ఇదే.
BC Reservations : రేపు క్యాబినెట్ సమావేశం
ఈ మొత్తం విషయంపై రాష్ట్ర క్యాబినెట్ రేపు తుది నిర్ణయం తీసుకోనుంది. ఎన్నికలను చట్టపరమైన రిజర్వేషన్లతోనే జరపాలా.. లేకపోతే హైకోర్టు స్టే కారణంగా పార్టీపరంగానే ముందుకు వెళ్లాలా? బీసీ సంఘాల డిమాండ్లను ఎలా నిర్వహించాలి.. కేంద్ర నాయకత్వంతో ఎలా సమన్వయం చేయాలి? ఈ అంశాలు రేపటి క్యాబినెట్ సమావేశంలో చర్చకు రానున్నాయి.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.







