Maredumilli Encounter : ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో మావోయిస్టులు, పోలీసులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఆరుగురు మావోయిస్టులు మృతిచెందారు. ఏపీ, ఛత్తీస్‌గఢ్, ఒడిశా సరిహద్దుల్లో (Chhattisgarh Border) మావోయిస్టుల కదలికలపై భద్రతా బలగాలకు సమాచారం అందింది. దీంతో మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో స్థానిక పోలీసులతో కలిసి కూబింగ్ నిర్వహించారు. ఈ క్రమంలో పోలీసులు, మావోయిస్టులు ఎదురపడడంతో పరస్పరం కాల్పులు జరుపుకొన్నారు. భద్రతా దళాల కాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతిచెందారు. ఆ ప్రాంతంలో ఇంకా కూంబింగ్ కొనసాగుతోందని అధికారులు వెల్లడించారు. మృతుల్లో మావోయిస్టు అగ్ర నేత హిడ్మా (Hidma), అతని సతీమణి హేమ ఉన్నారు. మరో అగ్రనేత ఆజాద్ కూడా మృతిచెందినట్లు సమాచారం. . మంగళవారం ఉదయం 6 నుంచి 7 గంటల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. హిడ్మపై రూ.కోటికిపైగా రివార్డు ఉండగా, ఆయన భార్య హేమపై రూ.50 లక్షలకుపైగా నగదు బహుమతిని ప్రభుత్వం ప్రకటించింది.
మోస్ట్ వాంటెడ్ హిడ్మా
ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లా పూనర్తి గ్రామానికి చెందిన హిడ్మా అలసు పేరు మాద్వి హిడ్మా అలియాస్ సంతోశ్. 25 ఏళ్ల క్రితం క్రితం అజ్ఞాతంలోకి వెళ్లారు. బస్తర్, దంతేవాడ ప్రాంత దళంలో కీలక సభ్యుడిగా ఎదిగారు. చిన్న వయస్సులోనే మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడిగా నియామకమయ్యారు. గెరిల్లా దాడులకు వ్యూహకర్తగా పేరొందిన హిడ్మా.. పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ (PLGA) ప్లాటూన్-1 కమాండర్‌గా పనిచేశారు. దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడిగానూ చేశారు. ఆయన మల్లా, నిషాద్ వర్గాలకు చెందిన వందలాది మందిని మావోయిస్టు పార్టీలో చేర్పించారు. వారికి సాయుధ శిక్షణ ఇచ్చి పీఎల్‌జీఏలో చేర్చి.. అభేద్యమైన సైన్యంగా తీర్చిదిద్దారు. గతంలో హిడ్మా నాయకత్వంలోనే భద్రతా బలగాలపై అనేక దాడులు జరిగాయని పోలీసు వర్గాలు పేర్కొన్నాయి.







