Group-II recruitment : గ్రూప్–II నియామకాలపై సంవత్సరాలుగా కొనసాగుతున్న గందరగోళం మధ్య తెలంగాణ హైకోర్టు ( Telangana High Court ) కీలక తీర్పు వెలువరించింది. రివాల్యుయేషన్ ఫలితాలను, Telangana Public Service Commission (TGPSC) విడుదల చేసిన తుది సెలక్షన్ లిస్టును పూర్తిగా రద్దు చేసింది. దీంతో మరోసారి ప్రభుత్వ నియామకాల్లో పారదర్శకతపై చర్చకు దారితీసింది.
అసలు వివాదం ఏమిటంటే…
గ్రూప్–II నియామకాల ప్రక్రియలో TGPSC పారదర్శకంగా వ్యవహరించలేదని పి. ప్రసన్నలత, బొక్కు సుజాత సహా మొత్తం 23 మంది అభ్యర్థులు కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. మార్పులు చేసిన OMR షీట్లను మూల్యాంకనంలో చేర్చారని వారి ప్రధాన ఆరోపణ. దీనివల్ల తుది జాబితా పూర్తి అన్యాయంగా, అసమంజసంగా ఉందని పేర్కొన్నారు. ఈ అభ్యర్థులు చూపిన ఆధారాలు బలంగా ఉండటంతో వారి వాదనలను కోర్టు అంగీకరించింది.
టాంపరింగ్ చేసిన OMR షీట్లే అసలు వివాదం
ముఖ్యంగా కమిషన్ మూల్యాంకనం చేసిన OMR షీట్లలో టాంపరింగ్ స్పష్టంగా కనిపించడాన్ని కోర్టు పరిశీలించింది. కొన్ని OMR షీట్లలో వైట్నర్, రబ్బరు గీతలు, చేర్పులు కనిపించాయి. 150 ప్రశ్నలున్న పత్రాల్లో సమాధానాలను మార్చిన గుర్తులు ఉన్నాయి. అలాగే, డివిజన్ బెంచ్ ఇచ్చిన స్పష్టమైన ఆదేశాలను TGPSC పాటించలేదని హైకోర్టు దృష్టికి వచ్చింది.
మునుపటి ఆదేశాల ప్రకారం.. టాంపరింగ్ చేసిన OMR షీట్లను అసలు మూల్యాంకించకూడదు. కానీ కమిషన్ అదే OMR షీట్లను కూడా మార్కులు ఇచ్చే ప్రక్రియలో కలపడం అన్యాయమని కోర్టు అభిప్రాయపడింది.
దిశా నిర్దేశం చేసిన న్యాయస్థానం
జస్టిస్ నాగేశ్ భీమపాకా ఇచ్చిన కీలక ఆదేశాలు ఇలా ఉన్నాయి:
-కొత్త రివాల్యుయేషన్ తప్పనిసరి
- టెక్నికల్ కమిటీ సిఫార్సులు, నియమాలను కచ్చితంగా పాటిస్తూ TGPSC మళ్లీ మార్కుల మూల్యాంకనం చేయాలి.
కొత్త సెలక్షన్ లిస్ట్ విడుదల చేయాలి - తాజా రివాల్యుయేషన్ ఆధారంగా మాత్రమే కొత్త ఎంపిక జాబితాను తయారు చేసి ప్రకటించాలి.
- ఎనిమిది వారాల్లో అపాయింట్మెంట్లు ఇవ్వాలి
- అర్హులైన అభ్యర్థులకు 8 వారాల వ్యవధిలో అపాయింట్మెంట్లు ఇవ్వాలి.
- ఇకపై జరిగే అన్ని రిక్రూట్మెంట్లలో OMR మూల్యాంకనానికి సంబంధించిన నియమాలు తప్పనిసరిగా అనుసరించాలి.
నియామకాల్లో పారదర్శకతపై కొత్త చర్చ
ఈ తీర్పు తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగ నియామకాల ప్రక్రియపై మళ్లీ దృష్టిని ఆకర్షించింది. OMR టాంపరింగ్ జరిగిందని కోర్టు గుర్తించడం, TGPSC సూచనలను పాటించలేదని వ్యాఖ్యానించడం… ఇవి అన్ని కలిపి పారదర్శకత , సాంకేతిక లోపాలు, చట్టపరమైన సమగ్రతపై పెద్ద చర్చకు దారితీస్తున్నాయి.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.







