- ఇనుప రేకులతో మాయాజాలం..
- రాజస్థాన్ కేటుగాళ్లు అరెస్ట్!
కాజీపేట, డిసెంబర్ 28: ఏటీఎం యంత్రాల్లో చిన్న ఇనుప రేకును అడ్డం పెట్టి, ఖాతాదారులు డ్రా చేసే నగదు బయటకు రాకుండా అడ్డుకుని, ఆ తర్వాత ఆ సొమ్మును కాజేస్తున్న రాజస్థాన్ ముఠాను (ATM Theft Gang) వరంగల్ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. సిసిఎస్ (CCS) మరియు కాజీపేట పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఈ ఆపరేషన్‌లో ఏడుగురు నిందితులను అరెస్టు చేశారు.
నిందితుల నుంచి రూ. 5,10,000 నగదు, రెండు కార్లు, ఏడు సెల్ఫోన్లు, నేరానికి వాడే ఐరన్ ప్లేట్లు, డూప్లికేట్ తాళం చెవులను స్వాధీనం చేసుకున్నారు. .
నిందితుల వివరాలు : అరెస్టు అయిన వారంతా రాజస్థాన్ రాష్ట్రం, అల్వార్ జిల్లా, మాల్కిడా తాలూకాకు చెందిన ఆరిఫ్ ఖాన్ (23), 2. సర్ఫరాజ్ (24), 3. ఎం. ఆష్ మహ్మద్ (29), 4. షాపుస్ ఖాన్ (33), 5. షారూఖాన్ (33), 6. అస్లాం ఖాన్ (33), 7. ఎం. షారుఖాస్ (27). మరో నిందితుడు సమీర్ ఖాన్ పరారీలో ఉన్నాడు.
చోరీ చేసే వినూత్న తీరు
వరంగల్ సెంట్రల్ జోన్ డిసిపి కవిత వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ ముఠా సభ్యులు ‘Perto’ కంపెనీకి చెందిన ఏటీఎం యంత్రాల్లోని సాంకేతిక లోపాన్ని ఆసరాగా చేసుకున్నారు. నిందితులు తమ వద్ద ఉన్న నకిలీ తాళం చెవులతో ఏటీఎం ముందు భాగాన్ని తెరిచి, నగదు బయటకు వచ్చే మార్గంలో (Cash Slot) ఎవరికీ కనిపించని విధంగా ఒక ఇనుప ప్లేటును గమ్‌తో అతికించేవారు. ఖాతాదారుడు డబ్బులు డ్రా చేసినప్పుడు, మిషన్ లోపల నగదు కౌంట్ అవుతుంది కానీ, ఈ రేకు అడ్డుగా ఉండటం వల్ల బయటకు రాకుండా చిక్కుకుపోతుంది. మిషన్ మొరాయించిందని భావించి ఖాతాదారుడు వెళ్ళిపోగానే, పరిసరాల్లోనే కాపు కాసిన నిందితులు ఏటీయంలోకి ప్రవేశించి తాళంతో యంత్రాన్ని తెరిచి, లోపల చిక్కుకున్న నగదును అపహరించేవారు.
దేశవ్యాప్తంగా 40కి పైగా చోరీలు
ఈ ముఠా కేవలం తెలంగాణలోనే కాకుండా తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్ మరియు కేరళ రాష్ట్రాల్లో కలిపి 40కి పైగా చోరీలకు పాల్పడ్డారు. వరంగల్ ట్రై సిటీ పరిధిలో గత నవంబర్ నుండి సుబేదారి (4), కాజీపేట, హన్మకొండ, మిల్స్ కాలనీల్లో ఒక్కొక్కటి చొప్పున మొత్తం 7 ఏటీఎంలలో రూ. 12.10 లక్షలు కాజేశారు.
వరంగల్ పోలీసుల ఆపరేషన్
ఏటీఎం సెక్యూరిటీ సంస్థ ‘FSS LTD’ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు.. అదనపు డీసీపీ బాల స్వామి, ఏసీపీలు సదయ్య, ప్రశాంత్ రెడ్డిల పర్యవేక్షణలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఆదివారం ఉదయం కాజీపేట చౌరస్తా వద్ద ఏటీయంలో ప్లేటు బిగిస్తుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నిందితులు పారిపోయే ప్రయత్నం చేసినా పోలీసులు వెంబడించి అదుపులోకి తీసుకున్నారు. ప్రతిభ కనబరిచిన పోలీసులకు రివార్డులు
ఈ ముఠాను పట్టుకోవడంలో కీలక పాత్ర పోషించిన సీసీఎస్ ఇన్స్పెక్టర్ రాఘవేందర్, కాజీపేట ఇన్స్పెక్టర్ సుధాకర్ రెడ్డి, ఎస్ఐలు నవీన్‌కుమార్, లవణ్ కుమార్, శ్రీనివాస్ రాజు, కానిస్టేబుల్ బృందాన్ని వరంగల్ పోలీస్ కమిషనర్ అభినందించి రివార్డులను అందజేశారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.







