హైదరాబాద్, జనవరి 3: తెలంగాణ రాష్ట్రంలో అర్హులైన ప్రతి నిరుపేదకు సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమని రెవెన్యూ, హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ప్రకటించారు. శనివారం శాసనసభలో ఇందిరమ్మ ఇండ్ల పథకం (Indiramma Indlu ) పై సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సుదీర్ఘంగా సమాధానమిచ్చారు. ఇందిరమ్మ ఇండ్ల మంజూరు అనేది కేవలం ఎన్నికల హామీ కాదని, ఇది ఒక నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.
మొదటి విడతలో భాగంగా మంజూరు చేసిన 4.50 లక్షల ఇండ్లలో, ప్రస్తుతం 3 లక్షల ఇండ్లు వివిధ నిర్మాణ దశల్లో ఉన్నాయి. మరో 52 వేల ఇండ్లు గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్నాయని మంత్రి తెలిపారు. ప్రతి సంవత్సరం మార్చి – ఏప్రిల్ నెలల్లో కొత్త ఇండ్ల మంజూరు చేపడతామని వెల్లడించారు. వచ్చే వర్షాకాలం నాటికి తొలి విడత ఇండ్లన్నీ పూర్తవుతాయని ధీమా వ్యక్తం చేశారు. మొదటి విడత తర్వాత మరో మూడు విడతలుగా ఇండ్ల మంజూరు ప్రక్రియ కొనసాగుతుంది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 20 లక్షల మంది లబ్ధిదారులను గుర్తించినట్లు ఆయన తెలిపారు.
పాత ప్రాజెక్టులపై దృష్టి – నిధుల విడుదల
గత ప్రభుత్వ హయాంలో అసంపూర్తిగా మిగిలిపోయిన ఇండ్లపై మంత్రి కీలక వివరాలు వెల్లడించారు.
133 కాలనీల్లోని 36 వేల ఇండ్లకు పౌర సదుపాయాల కల్పన కోసం రూ. 744 కోట్లు వెచ్చించినట్లు తెలిపారు. అసంపూర్తి ఇండ్లు: పెండింగ్‌లో ఉన్న ఇండ్ల పూర్తి కోసం రూ. 455 కోట్లు, ఆర్థిక సాయం అందని ఇండ్ల కోసం రూ. 204 కోట్లు ప్రభుత్వం విడుదల చేసిందన్నారు. నిర్మించినప్పటికీ కేటాయించని డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను అర్హులకు త్వరలోనే పార్టీ ప్రమేయం లేకుండా అందజేస్తామని హామీ ఇచ్చారు.
స్థలాల గుర్తింపు, గిరిజన ప్రాంతాల సమస్యలు
గ్రామీణ ప్రాంతాల్లో నిరుపేదల కోసం ఇండ్ల స్థలాలను గుర్తిస్తే, వాటిని వెంటనే మంజూరు చేస్తామని అధికారులకు సూచించారు. గిరిజన ప్రాంతాల్లో అటవీ శాఖ అనుమతుల వల్ల ఇండ్ల నిర్మాణానికి ఆటంకం కలగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు. 400-600 చదరపు అడుగుల పరిమితి కంటే కొంచెం ఎక్కువగా నిర్మించుకున్న వారికి నిబంధనల నుండి మినహాయింపు ఇస్తామని సానుకూల నిర్ణయం ప్రకటించారు. సింగరేణి ప్రాంతంలో ఇండ్ల పట్టాల సమస్యను త్వరలోనే కేబినెట్‌లో చర్చించి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ, పేదవాడి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచే ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ప్రభుత్వం వెనకాడదని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.







