హైదరాబాద్ : బీర్ ప్రియులకు ఊహించని షాక్! వేసవిలో కాస్త ఉపశమనం కోసం చల్లటి బీర్ తాగుదామని బాటిల్ కొన్న ఓ వ్యక్తికి అందులో వింత దృశ్యం కనిపించింది. బాటిల్ లోపల ఓ చిన్న చేప పిల్ల హాయిగా ఈదుతూ (Fish in Beer Bottle) కనిపించడంతో ఆ కస్టమర్ ఒక్కసారిగా అవాక్కయ్యాడు. హైదరాబాద్‌లోని నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్లాపూర్‌లో ఈ విస్తుపోయే ఘటన చోటుచేసుకుంది.
అసలేం జరిగిందంటే?
మల్లాపూర్‌లోని జేపి వైన్ షాపులో ఓ వ్యక్తి శుక్రవారం నాడు ఒక కింగ్‌ఫిషర్ లైట్ (Kingfisher Light) బీర్ బాటిల్‌ను కొనుగోలు చేశాడు. తాగేందుకు సిద్ధమై బాటిల్ మూత తీయబోతుండగా, లోపల ఏదో కదులుతున్నట్లు గమనించాడు. నిశితంగా పరిశీలించగా.. అందులో ఒక చిన్న చేప పిల్ల ప్రాణంతో ఉండి, ఈదుతూ కనిపించింది. సీల్డ్ బాటిల్‌లో చేప పిల్ల ఎలా వచ్చిందనేది ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది.
బీర్ బాటిల్‌లో ప్రత్యక్షమైన చేప పిల్ల
హైదరాబాద్ – నాచారం పరిధిలోని మల్లాపూర్ సమీపంలో ఉన్న ఒక వైన్స్ షాపులో కింగ్‌ఫిషర్ బీర్ కొని, అందులో చేప పిల్లను చూసి షాకైన వ్యక్తి pic.twitter.com/LwNrKLTV2u
— Telugu Scribe (@TeluguScribe) March 7, 2026
“కంపెనీని అడుక్కో పో..”
బాటిల్‌లో చేప పిల్లను చూసిన కస్టమర్ వెంటనే వైన్ షాపు నిర్వాహకులను ప్రశ్నించాడు. అయితే, బాధ్యతగా సమాధానం చెప్పాల్సిన షాపు యజమాని సదరు కస్టమర్‌పై దురుసుగా ప్రవర్తించాడు. “బీర్లు మేము తయారు చేయము.. ఏమైనా ఉంటే తయారు చేసిన కంపెనీని అడుక్కోవాలి” అంటూ నిర్లక్ష్యంగా సమాధానమిచ్చాడు. దీంతో బాధితుడు ఆ బాటిల్‌ను, అందులో కదులుతున్న చేప పిల్లను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది.
Kingfisher Beer Fish Video : వినియోగదారుల ఆందోళన
ఈ ఘటనపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. లిక్కర్ కంపెనీల క్వాలిటీ కంట్రోల్ ఏ స్థాయిలో ఉందో ఈ ఘటన అద్దం పడుతోందని విమర్శిస్తున్నారు. బాటిల్ క్లీనింగ్, ప్యాకేజింగ్ సమయంలో అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి కలుషితమైన పానీయాలు తాగితే ప్రాణాపాయం సంభవించే అవకాశం ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో ఎక్సైజ్ శాఖ అధికారుల దృష్టికి వెళ్లినట్లు తెలుస్తోంది. సదరు వైన్ షాపు, తయారీ కంపెనీపై చర్యలు తీసుకోవాలని బాధితుడు కోరుతున్నాడు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.








