- వరంగల్ శివార్లలో ‘నాలా’ దందా: తహశీల్దార్ కన్వర్షన్ల కహానీ!
- ధరణి, భూభారతి లోపాలే పెట్టుబడిగా అక్రమాల పర్వం..
- 40కి పైగా అక్రమ వెంచర్లకు క్లియరెన్స్. ప్రభుత్వ ఖజానాకు భారీ గండి.
Warangal NALA Conversion Scam భూమి రికార్డుల ప్రక్షాళన కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణి, భూభారతి పోర్టల్ లోని సాంకేతిక లోపాలు కొందరు అధికారులకు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (GWMC) శివార్లలోని ఒక మండల తహశీల్దార్, నిబంధనలను తుంగలో తొక్కి రియల్ ఎస్టేట్ వ్యాపారులతో చేతులు కలిపినట్లు తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సుమారు 40కి పైగా అనధికారిక (Non-Layout) వెంచర్లలోని వందలాది ప్లాట్లకు నిబంధనలకు విరుద్ధంగా నాలా (NALA) కన్వర్షన్లు మంజూరు చేయడం ఇప్పుడు రెవెన్యూ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
అక్రమ వెంచర్లకు ‘నాలా’ అండ
సాధారణంగా ఏదైనా భూమిని వెంచర్‌గా మార్చాలంటే కుడా (KUDA) లేదా మున్సిపల్ కార్పొరేషన్ (GWMC)నుండి లేఅవుట్ అనుమతులు తప్పనిసరి. కానీ, సదరు తహశీల్దార్ ధరణి,భూభారతి పోర్టల్‌లోని వెసులుబాటును ఆసరాగా చేసుకొని, ఎలాంటి అనుమతులు లేని వెంచర్లలోని ప్లాట్లకు నేరుగా నాలా కన్వర్షన్లు ఇచ్చేస్తున్నారు. ఒక్కో ప్లాట్‌కు రేటు ఫిక్స్ చేసి, పెద్ద ఎత్తున ముడుపులు పుచ్చుకున్నట్లు విమర్శలు వస్తున్నాయి. దీనివల్ల రియల్టర్లకు కోట్లాది రూపాయల లాభం చేకూరుతుండగా, ప్రభుత్వానికి రావాల్సిన డెవలప్‌మెంట్ ఛార్జీలు, ఇతర ఫీజుల రూపంలో భారీగా ఆదాయ గండి పడుతోంది.
ఆదాయానికి భారీ గండి: గణాంకాలు
విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ అక్రమ దందా వల్ల కలిగిన నష్టం ఇలా ఉంది:
| అంశం | వివరాలు |
| అక్రమ వెంచర్ల సంఖ్య | 40కి పైగా |
| కన్వర్షన్ చేసిన ప్లాట్ల సంఖ్య | సుమారు 400 |
| ఆదాయం కోల్పోతున్న సంస్థలు | KUDA, GWMC |
పాత అలవాటే.. ప్రస్తుత మండలంలోనూ!
సదరు అధికారి గతంలో దామెర మండలంలో పనిచేసినప్పుడు కూడా ఇలాంటి అక్రమాలకు పాల్పడినట్లు సమాచారం. అక్కడ కూడా నాన్-లేఅవుట్ ప్లాట్లకు విడివిడిగా పాస్‌బుక్‌లు జారీ చేయడం, నాలా కన్వర్షన్లు మంజూరు చేయడంలో సిద్ధహస్తుడని పేరు తెచ్చుకున్నారు. ఆ పాత అనుభవంతోనే ఇప్పుడు గ్రేటర్ శివార్లలోని కీలక మండలంలో ప్లాట్ల వారీగా కన్వర్షన్ల దందాను దిగ్విజయంగా కొనసాగిస్తున్నారని స్థానిక రెవెన్యూ వర్గాలతోపాటు రియల్ ఎస్టేట్ వ్యాపారులు సైతం చర్చించుకుంటున్నారు.
కుడా, గ్రేటర్ కార్పొరేషన్ ఆదాయానికి భారీ గండి
నిబంధనల ప్రకారం లేఅవుట్ అనుమతి పొందితే ప్రభుత్వానికి భారీగా ఆదాయం సమకూరుతుంది. కానీ తహశీల్దార్ నేరుగా కన్వర్షన్లు ఇవ్వడం వల్ల కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ (KUDA) కు రావాల్సిన ఫీజులు రావడం లేదు.
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (GWMC) అభివృద్ధి నిధులు కోల్పోతోంది.కేవలం తహశీల్దార్ స్వప్రయోజనాల కోసమే ప్రభుత్వ ఖజానాకు చేరాల్సిన సొమ్ము రియల్టర్ల జేబుల్లోకి వెళ్తోంది.
విచారణ జరిపితే నిజాలు బయటకి..
ఈ అధికారి బాధ్యతలు చేపట్టిన నాటి నుండి ఇప్పటివరకు జరిగిన అన్ని నాలా కన్వర్షన్లపై ఉన్నతాధికారులు క్షేత్రస్థాయి విచారణ చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. ప్రతి కన్వర్షన్ ఫైల్‌ను సరిచూస్తే, ఎన్ని అక్రమ లేఅవుట్లలోని ప్లాట్లకు అనుమతులు ఇచ్చారో, ప్రభుత్వం ఎంత ఆదాయం నష్టపోయిందో పూర్తిస్థాయిలో వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.విశ్వసనీయ సమాచారం ప్రకారం 40 కి పైగా అక్రమ వెంచర్ లలోని సుమారు 4 వందల ప్లాట్లకు ఈ అధికారి నాలా చేసినట్లు రికార్డులు స్పష్టం చేస్తున్నాయి.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.








