ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ డీజీపీ హెచ్.జె. దొర మృతి పట్ల ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణం పోలీస్ రంగానికి తీరని లోటని పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఇంటెలిజెన్స్ చీఫ్‌గా, డీజీపీగా ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు.
కేంద్ర విజిలెన్స్ కమిషనర్‌గా, సీఐఎస్‌ఎఫ్ డీజీగా కీలక బాధ్యతలు నిర్వహించిన దొర, పోలీస్ శాఖలో అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టారని సీఎం గుర్తుచేసుకున్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో తనదైన ముద్ర వేయడమే కాకుండా, పోలీసులను ప్రజలకు చేరువ చేయడంలో ఆయన కృషి మరువలేనిదని అన్నారు. దొర కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలుపుతూ, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు








