Jeevan Reddy Resigns Congress | ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాజకీయ ఉద్ధండుడు, మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీతో తన నాలుగు దశాబ్దాల సుదీర్ఘ ప్రయాణానికి స్వస్తి పలికారు. ఈ నెల మార్చి 25న తాను అధికారికంగా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటిస్తూ, పార్టీని వీడటానికి గల కారణాలను వివరిస్తూ ఒక బహిరంగ లేఖను విడుదల చేశారు. గత కొంతకాలంగా పార్టీలో జరుగుతున్న పరిణామాలపై ఆయన తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు.
20 నెలల మానసిక క్షోభ: లేఖలో ఆవేదన
తన రాజకీయ సహచరులు, అభిమానులను ఉద్దేశించి రాసిన లేఖలో జీవన్ రెడ్డి కీలక విషయాలను ప్రస్తావించారు. “గత 20 నెలలుగా కాంగ్రెస్ పార్టీలో తీవ్ర అవమానాలను ఎదుర్కొంటున్నాను. ఆత్మాభిమానాన్ని చంపుకుని, గౌరవం లేని చోట ఇంకా కొనసాగడం నా వల్ల కాదు. ఈ మానసిక క్షోభను అనుభవిస్తూ పార్టీలో ఉండలేను” అని ఆయన స్పష్టం చేశారు.
సీనియర్ నేత జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. గత 20 నెలలుగా మానసిక క్షోభ అనుభవిస్తున్నానని, ఆత్మాభిమానం లేని చోట ఉండలేనని లేఖ విడుదల చేశారు pic.twitter.com/Jdw9bo2V5S
— Sarkarlive.net (@sarkarlivenews) March 22, 2026
ముగిసిన రాయబారాలు.. ‘సారీ శ్రీధర్’
జీవన్ రెడ్డిని బుజ్జగించేందుకు రాష్ట్ర మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం శనివారం జగిత్యాలలోని ఆయన నివాసానికి వెళ్లారు. గంటకు పైగా చర్చలు జరిపినప్పటికీ జీవన్ రెడ్డి తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబుతో ఆయన అన్న మాటలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.
“సారీ శ్రీధర్.. ఆత్మాభిమానం చంపుకుని కాంగ్రెస్‌లో ఉండలేను. మీకో దండం.. మీ పార్టీకో దండం” అంటూ ఆయన తెగేసి చెప్పారు.
అసలు కారణం ఇదేనా?
బీఆర్‌ఎస్ నుంచి గెలిచిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరడం జీవన్ రెడ్డికి అస్సలు నచ్చలేదు. పార్టీ కోసం దశాబ్దాలుగా కష్టపడిన తనకంటే, ఫిరాయించి వచ్చిన వారికే అధిష్ఠానం మరియు సీఎం రేవంత్ రెడ్డి ప్రాధాన్యత ఇవ్వడంపై ఆయన తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.
భవిష్యత్ కార్యచరణ: గ్రామాల బాట
మార్చి 25న ఉదయం 10 గంటలకు జగిత్యాలలోని బండారి గార్డెన్స్‌లో తన అనుచరులు, కార్యకర్తలతో జీవన్ రెడ్డి భారీ సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సభలోనే తన భవిష్యత్ రాజకీయ ప్రణాళికను వెల్లడించనున్నారు. అనంతరం మార్చి 27 నుంచి ఆయన ‘గ్రామాల బాట’ కార్యక్రమం చేపట్టి, తనకు జరిగిన అన్యాయాన్ని ప్రజలకు వివరించి వారి అభిప్రాయాలను సేకరించనున్నారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి.








