హరిహర, శ్రీలక్ష్మీ సాయి మిల్లుల్లో ధాన్యం మాయం!
Warangal Rice Mill Paddy Scam | ప్రభుత్వ రికార్డుల్లో చూస్తే వేల క్వింటాళ్ల ధాన్యంతో ఆ మిల్లులు కళకళలాడుతున్నాయి. కానీ క్షేత్రస్థాయిలో అడుగుపెడితే అక్కడ ఖాళీ గదులు దర్శనమిస్తున్నాయి. అధికారుల పర్యవేక్షణ లోపం, మిల్లు యజమానుల కాసుల కక్కుర్తి వెరసి ప్రభుత్వ సొమ్ము పక్కదారి పడుతోంది. వరంగల్ జిల్లాలోని హరిహర ఇండస్ట్రీస్, శ్రీలక్ష్మీ సాయి బిన్నీ రైస్ మిల్లుల్లో జరుగుతున్న అక్రమాలు ఇప్పుడు జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.
నిబంధనలు బేఖాతరు.. ఇష్టారాజ్యం!
కస్టమ్ మిల్లింగ్ రైస్ (CMR) కింద ప్రభుత్వం అప్పగించిన ధాన్యాన్ని నిబంధనల ప్రకారం మిల్లింగ్ చేసి తిరిగి ప్రభుత్వానికి అప్పగించాల్సి ఉంటుంది. అయితే, ఈ రెండు మిల్లుల యజమానులు నిబంధనలను తుంగలో తొక్కారు. కోట్ల రూపాయల విలువైన ధాన్యాన్ని బహిరంగ మార్కెట్కు తరలించి సొమ్ము చేసుకున్నట్లు తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

హరిహర ఇండస్ట్రీస్ (నార్లవాయి): సంగెం మండలం నార్లవాయి గ్రామంలోని ఈ మిల్లుకు ప్రభుత్వం 1876.604 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కేటాయించింది. దీనికి బదులుగా మిల్లు యాజమాన్యం 1276.115 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ప్రభుత్వానికి తిరిగి ఇవ్వాలి. కానీ, ఇప్పటికీ సుమారు రూ. 2 కోట్లకు పైగా విలువైన బియ్యం బాకీ పడింది. విచారకరమైన విషయమేమిటంటే, మిల్లులో ఉండాల్సిన ధాన్యంలో సగానికి పైగా నిల్వలు మాయమయ్యాయి.

శ్రీలక్ష్మీ సాయి బిన్నీ రైస్ మిల్ (కొమ్మాల) : గీసుగొండ మండలం కొమ్మాల శివారులోని ఈ మిల్లుకు 2235.240 మెట్రిక్ టన్నుల ధాన్యం పంపగా, వారు 1497.611 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ప్రభుత్వానికి అప్పగించాలి. ఇక్కడ కూడా సుమారు రూ. 2 కోట్లకు పైగా విలువైన బియ్యం నిల్వలు లెక్కతేలడం లేదు. రికార్డుల్లో నిల్వలు నిండుగా కనిపిస్తున్నా, వాస్తవంగా మిల్లులో ధాన్యం గింజ కూడా లేకపోవడం గమనార్హం.
Also Read : అరవింద రైస్మిల్లో ఫిజికల్ వెరిఫికేషన్ జరిగేనా
Rice Mill Paddy Scam : అధికారుల ‘మామూలు’ మత్తు?
ఈ బహిరంగ దందా సాగుతున్నా పౌరసరఫరాల శాఖ అధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. క్రమం తప్పకుండా స్టాక్ వెరిఫికేషన్ చేయాల్సిన బాధ్యత ఉన్న అధికారులు, మిల్లు యజమానుల ఇచ్చే ‘మామూళ్ల’ మత్తులో మునిగితేలుతున్నారా? అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. తనిఖీలు లేకపోవడంతోనే మిల్లర్లు అడ్డు అదుపు లేకుండా ప్రభుత్వ ఆస్తిని మాయం చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.
పేదల బియ్యం.. ప్రైవేటు పాలు!
రైతుల నుంచి సేకరించిన ధాన్యం పేదల ఆకలి తీర్చాల్సిన బియ్యంగా మారకుండానే ప్రైవేటు వ్యాపారుల చేతుల్లోకి చేరుతోంది. కోట్లాది రూపాయల ప్రభుత్వ సంపద ఇలా పక్కదారి పడుతుంటే, సంబంధిత పౌరసరఫరాల శాఖాధికారులు ఎప్పుడు మేల్కొంటారు? సదరు మిల్లులపై తనిఖీలు నిర్వహించి, బాధ్యులపై కఠిన చర్యలు ఎప్పుడు తీసుకుంటారో వేచి చూడాలి.








