Sarkar Live

సంక్షోభంలో ‘అన్నపూర్ణ’ వెన్నెముక–రైస్ మిల్లర్ల ఆవేదన!

తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలిచే రైస్ మిల్లింగ్ పరిశ్రమ నేడు కుప్పకూలే స్థితికి చేరుకుంది. అన్నదాత పండించిన ప్రతి గింజను బియ్యంగా మార్చి కోట్లాది మంది ఆకలి తీర్చే ఈ పరిశ్రమ, ఇప్పుడు ప్రభుత్వ నిర్లక్ష్యానికి, అశాస్త్రీయ నిబంధనలకు బలైపోతోంది.

తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలిచే రైస్ మిల్లింగ్ పరిశ్రమ నేడు కుప్పకూలే స్థితికి చేరుకుంది. అన్నదాత పండించిన ప్రతి గింజను బియ్యంగా మార్చి కోట్లాది మంది ఆకలి తీర్చే ఈ పరిశ్రమ, ఇప్పుడు ప్రభుత్వ నిర్లక్ష్యానికి, అశాస్త్రీయ నిబంధనలకు బలైపోతోంది. ముఖ్యంగా వరంగల్ జిల్లాలో వేల కుటుంబాలకు ఉపాధి కల్పిస్తున్న ఈ రంగాన్ని ’25 శాతం పెనాల్టీ’ భూతం వెంటాడుతోంది.

నిలువునా ముంచుతున్న పెనాల్టీలు: ఇది జరిమానా కాదు.. మరణశాసనం!

ప్రకృతి వైపరీత్యాలు, సాంకేతిక లోపాలు లేదా ఎఫ్.సి.ఐ (FCI) వద్ద జరిగే జాప్యం వల్ల సీఎంఆర్ (CMR) డెలివరీలో స్వల్ప జాప్యం జరిగితే, ప్రభుత్వం విధిస్తున్న 25 శాతం భారీ పెనాల్టీ మిల్లర్ల పాలిట ఉరితాడుగా మారుతోంది. 2014 నుండి పేరుకుపోయిన కోట్ల రూపాయల బకాయిలు ఒకవైపు, పెరిగిన బ్యాంకు వడ్డీలు మరోవైపు మిల్లర్లను ఆత్మహత్యల దిశగా నెడుతున్నాయి. ప్రభుత్వం నుండి మాకు రావాల్సిన బకాయిలు చెల్లించండి, ప్రభుత్వానికి ఒక్క గింజ బాకీ లేకుండా సీఎంఆర్ పెడుతాం అంటున్న వరంగల్ జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు గోనెల రవీందర్ తో సర్కార్ లైవ్ ప్రతినిధి నమిండ్ల ప్రమోద్ ప్రత్యేక ఇంటర్వ్యూ..

ప్రశ్న: జిల్లాలో మిల్లర్లు ప్రస్తుతం ఎదుర్కొంటున్న అతిపెద్ద ఆర్థిక సంక్షోభం ఏమిటి? 

గోనెల రవీందర్: జిల్లావ్యాప్తంగా వందలాది మిల్లుల నిర్వహణ భారమైంది. ప్రభుత్వ బిల్లులు సకాలంలో రాకపోవడం, పెండింగ్‌లో ఉన్న కోట్లాది రూపాయల బకాయిల వల్ల బ్యాంక్ వడ్డీలు కట్టలేక మిల్లర్లు తమ ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది. శ్రమను గుర్తించాల్సిన సర్కారు, జరిమానాలతో వేధించడం ఎంతవరకు న్యాయం?

ప్రశ్న: సీఎంఆర్ డెలివరీలో జాప్యానికి మిల్లర్లే కారణమని ప్రభుత్వం భావిస్తోంది. దీనిపై మీ సమాధానం? 

గోనెల రవీందర్: ఇది పచ్చి అబద్ధం. అసలు సమస్య ఎఫ్ సి ఐ (Food Corporation of India) వద్ద ఉంది. మేము బియ్యం లోడ్ పంపినా, అక్కడ అన్‌లోడ్ చేసుకోవడానికి సరైన ఏర్పాట్లు లేవు. లారీలు రోజుల తరబడి క్యూలో ఉంటున్నాయి. లోపం వ్యవస్థలో ఉంటే, శిక్ష మాత్రం మిల్లర్లకు వేయడం దారుణం. 25 శాతం పెనాల్టీ అనేది ఏ వ్యాపారంలోనూ ఉండదు, ఇది మిల్లర్ల నడ్డి విరిచే చర్య.

ప్రశ్న: ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే రాబోయే పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి?

గోనెల రవీందర్: ఇప్పటికే ఆర్థిక ఒత్తిడి తట్టుకోలేక కొందరు మిల్లర్లు ప్రాణాలు కోల్పోయారు. ప్రభుత్వం వెంటనే చర్చలకు పిలవాలి. పెనాల్టీలు రద్దు చేసి, పెండింగ్ బిల్లులు విడుదల చేయాలి. లేదంటే పరిశ్రమ మూతపడటం ఖాయం. అదే జరిగితే వేలమంది కార్మికులు రోడ్డున పడతారు.

తక్షణ పరిష్కారాలు

● 2014 నుండి పెండింగ్ లో ఉన్న బిల్లులను ప్రభుత్వం విడుదల చేస్తేమిల్లులకు ఆర్థిక వెసులుబాటు, నిర్వహణ సులభం అవుతుంది.

● ప్రభుత్వం 25% పెనాల్టీ రద్దు చేస్తే మిల్లర్ లకు ఆర్థిక భారం తగ్గి, సీఎంఆర్ ప్రక్రియ వేగవంతం అవుతుంది

●ప్రభుత్వం కనుక 100% టార్గెట్ కేటాయింపు చేస్తే మిల్లుల్లోని ధాన్యం నిల్వల సమస్య పరిష్కారం అవుతుంది

● మిల్లర్ లకు ప్రభుత్వం చెల్లించే మిల్లింగ్ చార్జీలను పెంచితే ,మిల్లుల ఆధునీకరణకు, కార్మికుల సంక్షేమానికి తోడ్పాటవుతుంది.

ప్రభుత్వం మేల్కొనేది ఎప్పుడు?

రైస్ మిల్లులు మూతపడితే అది కేవలం మిల్లర్ల సమస్య మాత్రమే కాదు. ఇది పరోక్షంగా రైతులపై, ధాన్యం సేకరణపై మరియు బహిరంగ మార్కెట్ ధరలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ప్రభుత్వం తక్షణమే ఒక ఉన్నత స్థాయి కమిటీని వేసి, ఈ సంక్షోభానికి చరమగీతం పాడాలి. లేదంటే “బియ్యం బతుకుల్లో చేదు నిజాలు” రేపు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకే ముప్పుగా మారవచ్చు.

“పరిశ్రమను కాపాడటం అంటే.. రైతును, కార్మికుడిని కాపాడటమే!”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More Posts

Web Stories

Recent Posts

error: Content is protected !!
Rajma | ఇలాంటి సమస్యలున్నవారు రాజ్మా తినడం ప్రమాదమే! Nirgundi | వావిలి మొక్కలు దివ్యమైన ఔషధ గుణాలు.. Tulsi Leaves : ఉదయాన్నే తులసి ఆకులు తింటే ఏమవుతుంది?