సమాజాన్ని పట్టిపీడిస్తున్న ప్లాస్టిక్ మహమ్మారిని తరిమికొట్టడానికి ఎన్.ఎస్.ఎస్ వాలంటీర్లు నడుం బిగించాలని ఎన్.ఎస్.ఎస్ ప్రోగ్రాం కో ఆర్డినేటర్ ప్రొఫెసర్ ఈసం నారాయణ పిలుపునిచ్చారు.
హన్మకొండ పరిధిలోని న్యూశాయంపేట పోచంపల్లిలో, తెలంగాణ సాంఘీక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎన్.ఎస్.ఎస్ ప్రత్యేక శిబిరం బుధవారం రెండో రోజుకు చేరుకుంది. ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ ఇనుగాల రాధిక నేతృత్వంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో 50 మంది వాలంటీర్లు ఉత్సాహంగా పాల్గొన్నారు.
హోరెత్తిన నినాదాలు – అవగాహన ర్యాలీ
శిబిరంలో భాగంగా వాలంటీర్లు గ్రామంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు ప్లాస్టిక్ వల్ల కలిగే నష్టాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.
“ప్లాస్టిక్ భూతాన్ని నిర్మూలిద్దాం – పచ్చదనాన్ని పెంచుదాం”
“ప్లాస్టిక్ వద్దు – ప్రాణాలు ముద్దు”
“ప్లాస్టిక్ ను నిషేధిద్దాం – పర్యావరణాన్ని రక్షిద్దాం” అంటూ చేసిన నినాదాలు హోరెత్తించాయి.
పర్యావరణ పరిరక్షణ మన బాధ్యత
ఈ సందర్భంగా ప్రొఫెసర్ ఈసం నారాయణ మాట్లాడుతూ.. ప్రకృతి మనకు ప్రసాదించిన అద్భుతమైన వరమని, అయితే మానవ తప్పిదాల వల్ల భూమి ప్లాస్టిక్ వ్యర్థాల మయంగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్లాస్టిక్ వల్ల భూమి, జలాలు కలుషితం కావడమే కాకుండా మూగజీవాల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతోందని హెచ్చరించారు. ప్రతి వాలంటీర్ తనవంతుగా సమాజంలో మార్పు తీసుకురావాలని కోరారు.ఈ కార్యక్రమంలో అధ్యాపకులు జ్యోతి, గీతరాణి, డాక్టర్ విమల, జీపీఎస్ హెచ్.ఎమ్ ఉప్పలయ్య మరియు కళాశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.








