కమిషనరేట్ పరిధిలో నేరాల నియంత్రణకు ప్రతి పోలీస్ స్టేషన్ స్థాయిలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ను పటిష్టం చేయాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కాకతీయ మెడికల్ కళాశాల (KMC) ఆడిటోరియంలో నిర్వహించిన వార్షిక నేర సమీక్షా సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సీపీ పెండింగ్ కేసులు, నిందితుల అరెస్టులు, దర్యాప్తు పురోగతి మరియు వారెంట్ల అమలుపై అధికారులతో సుదీర్ఘంగా సమీక్షించారు. అనంతరం ఆయన అధికారులకు పలు కీలక సూచనలు చేశారు.
అక్రమ దందాలపై ఉక్కుపాదం…
ఇసుక అక్రమ రవాణా, గుట్కా విక్రయాలు, రేషన్ బియ్యం దందాలు మరియు పేకాట స్థావరాలపై కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. ముఖ్యంగా శివారు ప్రాంతాల్లో నిరంతర నిఘా ఉంచాలని సూచించారు.
గంజాయి మూలాలపై నజర్..
గంజాయి వినియోగదారులను పట్టుకోవడమే కాకుండా, సరఫరా చేసే ప్రధాన నెట్‌వర్క్‌ను ఛేదించాలని, ఇందుకోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు.
నేర నివారణకు సాంకేతికత
చోరీల నివారణకు పాత నేరస్తులపై హిస్టరీ షీట్లు తెరవాలని, ప్రజల భాగస్వామ్యంతో కాలనీల్లో సీసీ కెమెరాల ఏర్పాటుకు కృషి చేయాలని కోరారు. అన్ని కెమెరాలను వెంటనే జియో ట్యాగింగ్‌కు అనుసంధానించాలని ఆదేశించారు.
ట్రాఫిక్ & భద్రత..
రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రభుత్వం చేపట్టిన ‘ఆరైవ్ – ఆలైవ్’ (Arrive-Alive) కార్యక్రమంపై ప్రజల్లో వినూత్నంగా అవగాహన కల్పించాలన్నారు. అలాగే రాబోయే హనుమాన్ జయంతి వేడుకలు ప్రశాంతంగా జరిగేలా పక్కా బందోబస్తు ప్రణాళికలు రూపొందించాలని సూచించారు.
ఈ సమావేశంలో డీసీపీలు అంకిత్ కుమార్, రాజమహేంద్ర నాయక్, కవిత, జనగామ ఏఎస్పీ చేతన్, ట్రైనీ ఐపీఎస్ మనీషా నెహ్రాతో పాటు అదనపు డీసీపీలు, ఏసీపీలు మరియు ఇన్‌స్పెక్టర్లు పాల్గొన్నారు.








