- 8193 స్థలాల గుర్తింపు, 6261 భవనాలకు అనుమతులు, 5017కు అంచనాలు సిద్ధం
- యాదాద్రి భువనగిరి జిల్లా, సర్వేపల్లి గ్రామంలో తొలి భవనం ప్రారంభం
Women Shakti Buildings | తెలంగాణ రాష్ట్రంలో గ్రామీణ మహిళల ఆర్థిక, సామాజిక సాధికారతే లక్ష్యంగా ప్రభుత్వం చేపట్టిన ‘ఇందిరా మహిళా శక్తి’ పథకం క్షేత్రస్థాయిలో అద్భుత ఫలితాలను ఇస్తోంది. మహిళా సంఘాల (VO) కోసం గ్రామాల్లో ప్రత్యేక భవనాల నిర్మాణం ఇప్పుడు యజ్ఞంలా కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే వేల సంఖ్యలో స్థలాలను గుర్తించి, పనులను వేగవంతం చేశారు.
| అంశం | ప్రస్తుత పరిస్థితి |
| మొత్తం గ్రామ పంచాయతీలు | 12,728 |
| గుర్తించిన స్థలాలు | 8,193 |
| కలెక్టర్ల నుంచి అనుమతులు | 6,261 |
| సిద్ధమైన అంచనాలు (Estimates) | 5,017 |
ప్రతి గ్రామ పంచాయతీలో మహిళా భవనాల నిర్మాణానికి కనీసం 200 గజాల ప్రభుత్వ స్థలాన్ని గుర్తించాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఆదేశాలతో 12,728 గ్రామ పంచాయతీలు ఉండగా… ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 8,193 స్థలాలను గుర్తించారు. అందులో 6,261 భవనాలకు కలెక్టర్ల నుంచి అనుమతులు లభించగా, 5,017 భవనాల నిర్మాణాలకు అంచనాలు సిద్ధం అయ్యాయి. ప్రస్తుతం జిల్లాల వారీగా పనులు వేగంగా కొనసాగుతున్నాయి.
మంత్రి సీతక్క (Minister Seethakka) పర్యవేక్షణలో, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్ దివ్యా దేవరాజన్ ప్రత్యేక చొరవతో సెర్ప్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మధ్య సమన్వయానికి ప్రత్యేక యంత్రాంగం ఏర్పాటు చేయడం వల్ల స్థలాల గుర్తింపు నుంచి అనుమతులు, అంచనాలు, నిర్మాణం వరకు అన్ని దశల్లో పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
ములుగు జిల్లాలో పలు గ్రామాల్లో మంత్రి సీతక్క మహిళా భవనాలకు (Women Shakti Buildings) శంకుస్థాపనలు చేశారు. అలాగే యాదాద్రి భువనగిరి జిల్లాలో ఆత్మకూరు మండలం సర్వేపల్లి గ్రామంలో VO భవనం ప్రారంభమైంది. రంగారెడ్డి జిల్లాలో కేశంపేట మండలం ఆల్వాల్ గ్రామపంచాయతీలో కూడా భవనం పూర్తయింది. ఈ మహిళా భవనాలు గ్రామీణ మహిళలకు ఆత్మగౌరవానికి, ఆర్థిక స్వావలంబనకు, పరస్పర ఐక్యతకు ప్రతీకలుగా నిలవనున్నాయి. మహిళా సంఘాల సమావేశాలు, శిక్షణా కార్యక్రమాలు, నైపుణ్యాభివృద్ధి, ఆదాయ వనరుల పెంపు కార్యకలాపాలకు కేంద్రాలుగా మారనున్నాయి. అవసరమైతే మహిళలు తయారు చేసే ఉత్పత్తుల విక్రయ కేంద్రాలుగా కూడా వినియోగించుకునే అవకాశం ఉంటుంది.
ఆర్థిక బలోపేతానికి మహిళా భవనాలు (Women Shakti Buildings) మంత్రి సీతక్క
“ప్రతి గ్రామంలో మహిళలకు బలమైన వేదిక కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం. మహిళా సంఘాల భవనాలు వారి ఆర్థిక, సామాజిక బలోపేతానికి కేంద్రాలుగా మారతాయి. మహిళలు స్వయం ఉపాధి అవకాశాలను విస్తరించుకోవడానికి, ఒకచోట చేరి నిర్ణయాలు తీసుకునే వేదికగా ఇవి ఉపయోగపడతాయి. నిర్దిష్ట కాలంలో భవనాల నిర్మాణాన్ని పూర్తి చేసి మహిళలకు అందుబాటులోకి తీసుకురావాలి”








