మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో జరిగిన 69వ జాతీయ పోలీస్ డ్యూటీ మీట్ (AIPDM) లో వరంగల్ పోలీస్ కమిషనరేట్ ప్రతిభ చాటింది. కమిషనరేట్ పీఆర్వో విభాగంలో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న మన్నవ మోహన కృష్ణ తన అద్భుతమైన ఫోటోగ్రఫీ నైపుణ్యంతో జాతీయ స్థాయిలో రాణించారు.
మార్చి 29న ప్రారంభమైన ఈ ప్రతిష్టాత్మక పోటీల్లో దేశవ్యాప్తంగా ఉన్న వివిధ రాష్ట్రాల పోలీస్ విభాగాలు పాల్గొన్నాయి. ఇందులో “ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ టీం” విభాగంలో మోహన కృష్ణ తన నైపుణ్యాన్ని ప్రదర్శించి, తెలంగాణ పోలీస్ ఫోటోగ్రాఫర్స్ టీంను ద్వితీయ స్థానంలో నిలబెట్టారు.నాగ్‌పూర్ పోలీస్ శిక్షణ కేంద్రంలో జరిగిన ముగింపు వేడుకలకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మోహన కృష్ణ తన టీం సభ్యులైన కోచ్ జయరాజ్, కానిస్టేబుల్ రాజశేఖర్‌లతో కలిసి కేంద్ర మంత్రి చేతుల మీదుగా రన్నరప్ ట్రోఫీని అందుకున్నారు.”పోలీస్ విధుల్లో సాంకేతికత మరియు సృజనాత్మకత ఎంత ముఖ్యమో ఈ విజయం నిరూపించింది. జాతీయ స్థాయిలో వరంగల్ పేరు నిలబెట్టడం గర్వకారణంగా చెప్పొచ్చు.
హర్షం వ్యక్తం చేసిన ఉన్నతాధికారులు
జాతీయ స్థాయిలో రాణించి కమిషనరేట్‌కు పేరు తెచ్చిన మోహన కృష్ణను వరంగల్ పోలీస్ కమిషనర్ ప్రత్యేకంగా అభినందించారు. ఇతర ఉన్నతాధికారులు, తోటి సిబ్బంది ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, వృత్తిపరమైన ఫోటోగ్రఫీలో ఆయన చూపిన ప్రతిభను కొనియాడారు.








