గొర్రెకుంట రెవెన్యూ శివారులోని సర్వే నంబర్ 95లో ఉన్న ప్రభుత్వ భూముల ఆక్రమణలు, ప్రస్తుత పరిస్థితిపై ‘సర్కార్ లైవ్’ ప్రచురించిన కథనానికి రెవెన్యూ అధికారులు వేగంగా స్పందించారు. ఈ కథనంపై సానుకూలంగా స్పందించిన గీసుగొండ తహశీల్దార్ రియాజుద్దీన్, ఈ రోజు ఉదయం రెవెన్యూ సిబ్బంది తో కలిసి డిజిటల్ సర్వే చేపట్టారు.
క్షేత్రస్థాయిలో పరిశీలన
గీసుగొండ తహశీల్దార్ రియజుద్దీన్ రెవెన్యూ సిబ్బంది,సర్వేయర్ల తో కలిసి మంగళవారం గొర్రెకుంట శివారులోని సర్వే నంబర్ 95లోని భూములను సందర్శించారు. అత్యాధునిక డిజిటల్ సర్వే పరికరాల ద్వారా భూమి కొలతలు తీశారు. గత కొంతకాలంగా ఈ భూములకు సంబంధించి నెలకొన్న సందిగ్ధతను తొలగించేందుకు ఈ సర్వే కీలకం కానుంది.
హద్దుల ఏర్పాటుకు సన్నాహాలు
ఈ సందర్భంగా తహశీల్దార్ మాట్లాడుతూ.. “సర్కార్ లైవ్ “కథనం ద్వారా ప్రభుత్వ భూమికి సంబంధించిన అంశం మా దృష్టికి వచ్చింది. ప్రస్తుతం డిజిటల్ సర్వే చేయడం జరిగింది. సర్వే రిపోర్ట్ అందిన వెంటనే ప్రభుత్వ భూమికి స్పష్టమైన హద్దులు ఏర్పాటు చేస్తాం. ప్రభుత్వ భూమిని ఒక్క గుంట కూడా అన్యాక్రాంతం కాకుండా చూస్తామని,సర్కార్ భూమిని ఆక్రమించాలని చూస్తే కఠిన చర్యలు తప్పవని తహశీల్దార్ స్పష్టం చేసారు.
ప్రజల గొంతుకగా నిలిచిన ‘సర్కార్ లైవ్’ కథనానికి స్పందించి, ప్రభుత్వ ఆస్తుల రక్షణకు చర్యలు చేపట్టిన రెవెన్యూ యంత్రాంగానికి స్థానికులు ధన్యవాదాలు తెలుపుతున్నారు.








