తెలంగాణలోని పలు జిల్లాల్లో అర్ధరాత్రి ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కురిసిన భారీ వర్షం (Unseasonal Rains) అన్నదాతలను అతలాకుతలం చేసింది. గత కొన్ని రోజులుగా భానుడి భగభగలతో అల్లాడిపోతున్న ప్రజలకు ఈ వర్షం కాస్త ఉపశమనం ఇచ్చినప్పటికీ, రైతన్నలకు మాత్రం కోలుకోలేని దెబ్బ తీసింది. రాష్ట్రవ్యాప్తంగా ఐకేపీ (IKP) కొనుగోలు కేంద్రాలు, మార్కెట్ యార్డులు, కల్లాల్లో ఆరబోసిన వరి, మక్క ధాన్యం పూర్తిగా తడిసి ముద్దయింది. కొన్ని ప్రాంతాల్లో వరద నీటికి వడ్ల కుప్పలు కొట్టుకుపోయాయి. ఆరుగాలం కష్టపడి పండించిన పంట కళ్ల ముందే కొట్టుకుపోతుంటే ఏమీ చేయలేక నిస్సహాయ స్థితిలో రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు.
జగిత్యాల, పెద్దపల్లి మార్కెట్లలో ధాన్యపు రాశులు నదిలా..
జగిత్యాల జిల్లా మెట్పల్లి వ్యవసాయ మార్కెట్లో ఆరబోసిన వడ్లు, మక్కలు నిన్నటి వర్షానికి (Rains) పూర్తిగా తడిసిపోయాయి. పెద్దపల్లి మార్కెట్ యార్డులో ధాన్యం వరద నీటిలో కొట్టుకుపోయింది. తూకానికి (కాంటాకు) సిద్ధంగా ఉంచిన మక్కల బస్తాల్లోకి వర్షపు నీరు చేరింది. దీంతో తడిసిన, రంగుమారిన ధాన్యాన్ని ఎలాంటి నిబంధనలు పెట్టకుండా ప్రభుత్వమే మద్దతు ధరకు కొనుగోలు చేయాలని రైతులు, నష్టపోయిన రైతులకు తక్షణమే పరిహారం ఇచ్చి ఆదుకోవాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
మెదక్ జిల్లాలో ఈదురు గాలుల బీభత్సం.. కల్లాల్లోనే వడ్లు
మెదక్ జిల్లాలో మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షం, ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. గాలుల ధాటికి పలుచోట్ల చెట్లు, కరెంట్ స్తంభాలు కూలిపోయాయి. మెదక్, హవేలీ ఘనాపూర్, పాపన్నపేట, కుల్చారం, కౌడిపల్లి, చిలిపిచెడ్, చిన్న శంకరంపేట్, రామాయంపేట, చేగుంటతో పాటు పలు మండలాల్లోని కొనుగోలు కేంద్రాలలో ఉన్న వరి ధాన్యం వరద నీట మునిగింది. సకాలంలో లారీలు రాకపోవడం, కాంటా వేయకపోవడం వల్లే తమ ధాన్యం నిలువ ఉండిపోయిందని, ఈ అకాల వర్షం తమను నిలువునా ముంచిందని రైతులు కన్నీటిపర్యంతమవుతున్నారు.
ప్రభుత్వ నిర్లక్ష్యంపై రైతుల ఆగ్రహం!
రెక్కలు ముక్కలు చేసుకొని, అప్పులు చేసి, ఇంటిల్లిపాది శ్రమించి పుట్లకొద్దీ పసిడి సిరులను పండిస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం, రైతుల పట్ల చిన్నచూపు వల్లే తాము తీవ్రంగా నష్టపోతున్నామని అన్నదాతలు మండిపడుతున్నారు. ధాన్యం సకాలంలో కొనుగోలు చేయకపోవడం, అరకొరగా కొన్నా కాంటాలు పెట్టకపోవడం, నెలల తరబడి గన్నీ సంచులు అందకపోవడం, తరుగు పేరుతో మిల్లర్లు దోపిడీకి పాల్పడుతున్నా అధికారులు పట్టించుకోకపోవడం వంటి అనేక సమస్యల వల్లే తాము కల్లాల్లోనే వేచి ఉండాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
లారీల కొరత.. లోడింగ్ ఆలస్యమే శాపమైంది!
చాలాచోట్ల కాంటాలు వేసి బస్తాల్లో నింపినప్పటికీ, లారీల కొరత కారణంగా లోడింగ్ చేయకుండా కొనుగోలు కేంద్రాల వద్దే నిలువ ఉంచారు. తీరా ఇప్పుడు అకాల వర్షం ముంచెత్తడంతో ఆ బస్తాలన్నీ తడిసిపోయి గింజలు మొలకెత్తే పరిస్థితి వచ్చింది. “సకాలంలో ప్రభుత్వం కొనుగోలు చేసి ఉంటే మాకీ నష్టం జరిగేది కాదు” అని రైతులు శాపనార్థాలు పెడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణమే స్పందించి, తడిసిన ప్రతి గింజనూ మద్దతు ధరతో కొనుగోలు చేసి, నష్టపోయిన రైతులకు ఎకరాకు పరిహారం ప్రకటించాలని క్షేత్రస్థాయి నుండి డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.








