Telangana Rains | తెలంగాణలో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వానలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో వాతావరణశాఖ కీలక సమాచారం అందించింది. తెలంగాణలో మళ్లీ భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం (IMD) హెచ్చరించింది. బుధవారం నుంచి శనివారం వరకు వర్షాలు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్ (Yellow Alert)జారీ చేసింది.
వాయువ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉన్న ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, సగటు సముద్రమట్టానికి 1.5 కి.మీ నుంచి 5.8 కి.మీ ఎత్తు వరకు విస్తరించి ఉందని తెలిపింది. దీంతో బుధవారం ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్, మహబూబాబాద్, ములుగు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే చాన్స్ ఉందని పేర్కొంది. అలాగే, జయశంకర్ భూపాలపల్లి, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.
ఇక గురువారం ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో.. శుక్రవారం నిజామాబాద్, భూపాలపల్లి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, జనగాం, యాదాద్రి భువనగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వివరించింది. శుక్రవారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, కొత్తగూడెం, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం తెలిపింది. ఇదిలా ఉండగా.. గడిచిన 24గంటల్లో ఆదిలాబాద్, ఆసిఫాబాద్, కరీంనగర్, సూర్యాపేట, కొత్తగూడెం, ములుగు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి. అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లా తాంసిలో 6.4, నేరడిగొండలో 8.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని వాతావరణ కేంద్రం చెప్పింది.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.







