Delhi News High Alert : న్యూఢిల్లీ: ఢిల్లీ ఎర్రకోట సమీపంలో జరిగిన ఘోర కారు పేలుడుతో సంబంధం ఉందని భావిస్తున్న మరో ఎరుపు రంగు ఫోర్డ్ ఎకోస్పోర్ట్ వాహనం కోసం పోలీసులు వేట ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ నగరంలోని అన్ని పోలీస్ స్టేషన్లు, చెక్‌పోస్టులు, సరిహద్దు ప్రాంతాలు హై అలర్ట్‌లో వున్నాయి.
పేలుడులో ఉపయోగించిన హ్యుందాయ్ i20 కారుతో పాటు, నిందితులు ఈ ఫోర్డ్ ఎకోస్పోర్ట్ వాహనాన్ని కూడా ఉపయోగించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ప్రస్తుతం ఐదు ప్రత్యేక ఢిల్లీ పోలీసు బృందాలు వాహనాన్ని వెతుకుతుండగా, ఉత్తరప్రదేశ్, హర్యానా పోలీసులకు కూడా ఈ సమాచారం అందించారు.
సోమవారం సాయంత్రం ఎర్రకోట మెట్రో స్టేషన్ గేట్ నంబర్ 1 సమీపంలో జరిగిన ఈ పేలుడులో 12 మంది ప్రాణాలు కోల్పోగా, పలువురు గాయపడిన విషయం తెలిసిందే. హ్యుందాయ్ i20 కారు ఒక్కసారిగా మంటలు అంటుకుని భీరకమైన పేలుడు సంభవించింది. సమీపంలోని అనేక వాహనాలు కూడా నాశనం అయ్యాయి. సాయంత్రం 6:55 గంటల సమయంలో ప్రమాద సమాచారం అందుకున్న ఢిల్లీ అగ్నిమాపక శాఖ వెంటనే ఏడు అగ్నిమాపక యంత్రాలను పంపి మంటలను అదుపులోకి తెచ్చింది.
ప్రాథమిక దర్యాప్తులో ఈ పేలుడు, ఇటీవల ఫరీదాబాద్‌లో బయటపడిన ఉగ్రవాద మాడ్యూల్‌తో సంబంధం ఉందని అధికారులు తెలిపారు. ఇప్పటికే అనేక మంది అనుమానితులు అరెస్టు అయ్యారు. దాడి వెనుక ఉన్న పూర్తి నెట్‌వర్క్‌ను గుర్తించేందుకు దర్యాప్తు వేగవంతం చేశారు.
క్షతగాత్రులను పరామర్శించిన ప్రధాని మోదీ
భూటాన్ పర్యటన ముగించుకుని భారత్ చేరుకున్న వెంటనే, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం ఎల్‌ఎన్‌జెపి హాస్పిటల్‌ను సందర్శించారు. పేలుడులో గాయపడిన వారిని పరామర్శించారు. వైద్యులతో మాట్లాడి బాధితులు త్వరగా కొలుకొనేలా మెరుగైన చికిత్స అందించాలని సూచించారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి.







