IVF tragedy : హైదరాబాద్‌లోని శంషాబాద్ (Shamshabad) ప్రాంతంలో ఓ విషాదం చోటుచేసుకుంది. కొన్ని గంటల వ్యవధిలోనే ఒకే కుటుంబంలో నాలుగు ప్రాణాలు గాలిలో కలిసి పోయాయి. గర్భంలో ఉండగానే కవల (twins) శిశువులు మృతి చెందగా, కాసేపటికే తల్లి తీవ్ర అస్వస్తకు గురై ప్రాణాలు వదిలింది. దీంతో మనస్తాపం చెందిన తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన నిన్నఉదయం చోటుచేసుకోగా పూర్తి వివరాలు ఈరోజు వెల్లడయ్యాయి.
ఆనందం.. అంతలోనే…
శంషాబాద్‌లోని స్వామి ఎన్‌క్లేవ్‌లో నివసిస్తున్న విజయ, శ్రావ్య దంపతులు (couple) పిల్లలు పుట్టకపోవడంతో తీవ్ర మనోవేదనకు గురయ్యారు. వివాహమై కొన్ని సంవత్సరాలు గడుస్తున్న అవుతున్నా వీరికి సంతానం కలగలేదు. దీంతో కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు వీరికి ఓ సలహా ఇచ్చారు. IVF చికిత్సతో పిల్లలు పుడతారని చెప్పడంతో ఓ ఆస్పత్రిని ఆశ్రయించారు. అక్కడ వైద్యం పొందిన శ్రావ్య కొన్ని రోజులకే గర్భం దాల్చింది. తనకు కవల పిల్లలు పుట్టబోతున్నారని పలు పరీక్షల ద్వారా తెలుసుకుంది. దీంతో శ్రావ్యతోపాటు ఆమె భర్త ఆనందానికి అవధులు లేకుండాపోయింది. అక్కడి వైద్యుల సూచనలు పాటిస్తూ చికిత్స పొందుతున్న క్రమంలోనే ఆ కుటుంబంలో అనూహ్య విషాదం చోటుచేసుకుంది.
IVF tragedy : కండ్లు తెరవకముందే విషాదం
ఎనిమిది నెలల గర్భంతో ఉండగా ఆదివారం ఉదయం శ్రావ్యకు ఒక్కసారిగా తీవ్రమైన నొప్పులు మొదలయ్యాయి. ఎనిమిదో నెలలో నొప్పులు రావడం ప్రమాదకమని గ్రహించి వెంటనే ఆమెను భర్త విజయ్ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. పరీక్షించిన వైద్యులు శ్రావ్య గర్భంలో ఉన్న కవల శిశువులు మృతి చెందారని నిర్ధారించారు. దీంతో భార్యాభర్తలు తీవ్ర దిగ్ర్భాంతికి గురయ్యారు. ఆ బాధను తట్టుకోలేక విజయ్ ఆస్పత్రి నుంచి బయటకు వెళ్లాడు. కొద్ది సేపటికే శ్రావ్య అతడికి ఫోన్ చేసి తన పరిస్థతి కూడా బాగా లేదని, వేరే ఆస్పత్రికి తీసుకెళ్లాలని చెప్పింది. దీంతో అక్కడికి చేరుకున్న విజయ్ ఆమెను మరో ఆస్పత్రికి తీసుకెళ్లాడు.
పరిస్థితి విషమించి..
శ్రావ్యను మరో ఆస్పత్రికి తీసుకెళ్లగా ఆమెను పరీక్షించిన వైద్యులు గర్భంలోని మృతశిశువుల వల్ల ఏర్పడిన సంక్లిష్టతలు, బీపీ కంట్రోల్ కాకపోవడం, శరీరంలోపల ఇన్‌ఫెక్షన్లు.. ఇవన్నీ కలిసి ఆరోగ్య పరిస్థతి విషమించిందని నిర్ధారించారు. చికిత్స అందిస్తున్న క్రమంలోనే శ్రావ్య మృతి చెందింది. .
మనస్తాపం చెందిన భర్త విజయ్
పుట్టక ముందే ఇద్దరు పిల్లలు, తర్వాత భార్య మృతి చెందడాన్ని విజయ్ తట్టుకోలేకపోయాడు. ఒక కుదుపుతోనే కలలన్నీ పటాపంచలు కావడంపై తీవ్ర మనస్తాపం చెందాడు. ఎన్నో ఏళ్ల తర్వాత పుట్టబోతున్న పిల్లలు గర్భంలోనే మృతి చెందడం, వారికి జన్మనివ్వాలనే పరితపించిపోయిన భార్య కూడా కన్నుమూయడం అతడిని తీవ్ర దిగ్ర్భాంతికి గురిచేసింది. కొన్ని గంటల్లోనే అతడు ఆత్మహత్య చేసుకున్నాడు.
పోలీసుల విచారణ
శంషాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. రెండు ఆస్పత్రుల్లో తీసుకున్న చికిత్స, అత్యవసర సమయంలో ఏం జరిగింది?, వైద్యుల పర్యవేక్షణలో ఎలాంటి లోపాలు (medical negligence) ఉన్నాయి? ఆలస్యం ఏమైనా జరిగిందా? తదితర విషయాలను పరిశీలిస్తున్నారు. శ్రావ్య, విజయ్ మృతదేహాలను పోస్ట్‌మార్టం (post-mortem) నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. నివేదికలు వచ్చాకే తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు తలిపారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.







