Telangana Legislative Council Members Suspension | హైదరాబాద్ : తెలంగాణ శాసనమండలి వేదికగా సోమవారం సంచలనం చోటుచేసుకుంది. రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా శాసనమండలి నుంచి ప్రతిపక్ష సభ్యులపై సస్పెన్షన్ వేటు పడింది. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి చెందిన రాఘవ కన్‌స్ట్రక్షన్స్ అక్రమ మైనింగ్‌పై హౌస్ కమిటీ వేయాలని, మంత్రిని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్‌ఎస్ సభ్యులు ఆందోళనకు దిగడంతో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారు.
మొదటిసారిగా సస్పెన్షన్.. చరిత్రలో నిలిచిపోయేలా!
కాగా తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే ఇలా మండలి సభ్యులపై సస్పెన్షన్ వేటు పడటం ఇదే తొలిసారి. సభ్యుల సస్పెన్షన్‌కు నిరసగా బీఆర్‌ఎస్ మండలి సభ్యులు చైర్మన్ పోడియం వద్ద నిరసన తెలిపారు. ఈ క్రమంలో మండలి సభ్యులను మార్షల్స్ బలవంతంగా లాక్కెళ్లారు. అక్రమ మైనింగ్ అంశంలో రాఘవ కన్‌స్ట్రక్షన్స్ వ్యవహారంపై సభా సంఘం వేయాలని.. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని బర్తరఫ్ చేయాలని నినాదాలు చేశారు. ఛైర్మన్ పోడియం వద్దకు వచ్చి ప్లకార్డులు పట్టుకుని ఎమ్మెల్సీలు నిరసన తెలిపారు. దీంతో మంత్రి శ్రీధర్‌బాబు స్పందిస్తూ ఈ అంశంపై సీఐడీ విచారణకు ఆదేశిస్తున్నట్లు శాసనసభలో సీఎం రేవంత్ స్పష్టం చేశారని చెప్పారు. సభ సజావుగా సాగేందుకు బీఆర్‌ఎస్ సభ్యులు సహకరించాలని కోరారు.
మరోవైపు మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి కూడా సభా కార్యక్రమాల నిర్వహణకు సహకరించాలని పదే పదే కోరారు. అయినప్పటికీ బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీలు ఆందోళన కొనసాగించడంతో వారిని సస్పెండ్ చేయాలని మంత్రి తీర్మానం ప్రవేశపెట్టారు. దీంతో ఒకరోజుకు బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీలను మండలి నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ఛైర్మన్ ప్రకటించారు. ఇప్పటికే అసెంబ్లీలో కూడా బిఆర్‌ఎస్ సభ్యులను ఆదివారం సస్పెండ్ చేశారు. సోమవరంతో అసెంబ్లీ సమావేశాలు ముగియనున్నాయి.
పొంగులేటిని బర్తరఫ్ చేయాల్సిందే: మధుసూదనాచారి
సస్పెన్షన్ అనంతరం గన్ పార్క్ వద్ద బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీలు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మధుసూదనాచారి మాట్లాడుతూ.. “ప్రభుత్వ ఆస్తులను కాజేస్తున్న పొంగులేటిని వెంటనే పదవి నుంచి తొలగించాలి.” “అక్రమ మైనింగ్ ఆధారాలను హరీష్ రావు ఇప్పటికే బయటపెట్టారు. సమాధానం చెప్పలేకే ప్రభుత్వం మమ్మల్ని సస్పెండ్ చేసింది.” “గతంలో వైఎస్సార్ హయాంలో ఓబులాపురం మైనింగ్ కేసులో సభా సంఘం వేశారు.. ఇప్పుడెందుకు భయపడుతున్నారు?” అని నిలదీశారు.
ఈ నిరసనలో ఎమ్మెల్సీలు వాణి దేవి, దేశపతి శ్రీనివాస్, తక్కిలపల్లి రవీందర్రావు, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి.








